కేంద్రం నిర్ణయంతో విమాన చార్జీల పెరుగుదల
ABN , Publish Date - Mar 22 , 2026 | 05:32 AM
అన్ని విమానాల్లో కనీసం 60 శాతం సీట్లను ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా ఉచితంగా ఎంచుకునేందుకు కేంద్రం ప్రయాణికులకు కల్పించిన వెసులుబాటును దేశీయ విమానయాన సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించాయి.
60శాతం సీట్లను ఉచితంగా ఎంచుకునే వెసులుబాటును వ్యతిరేకిస్తున్న విమానయాన సంస్థలు..
న్యూఢిల్లీ, మార్చి 21: అన్ని విమానాల్లో కనీసం 60 శాతం సీట్లను ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా ఉచితంగా ఎంచుకునేందుకు కేంద్రం ప్రయాణికులకు కల్పించిన వెసులుబాటును దేశీయ విమానయాన సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ నిర్ణయం వల్ల తాము కోల్పోయే ఆదాయాన్ని తిరిగి రాబట్టుకోవడానికి విమాన చార్జీలు పెంచాల్సి వస్తుందని పేర్కొన్నాయి. ఎయిరిండియా, ఇండిగో, స్పైస్ జెట్ సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఫెడరేషన్ ఇండియా ఎయిర్‌లైన్స్ (ఎఫ్‌ఐఏ) స్పందిస్తూ.. కేంద్రం తీసుకున్న నిర్ణయం విమానయాన రంగంలో ఊహించని ప్రతికూల పరిణామాలకు దారి తీస్తుందని.. తక్షణమే దాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ పౌర విమానయాన శాఖకు లేఖ రాసింది. ‘కేంద్రం నిర్ణయం కారణంగా విమానయాన సంస్థలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఈ నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు విమాన చార్జీలు పెంచాల్సి వస్తుంది. సీట్లను ముందుగా ఎంచుకోవడానికి ఇష్టపడని వారితో సహా ప్రయాణికులందరూ అప్పుడు అధిక చార్జీలు చెల్లించాల్సి వస్తుంది’ అని అందులో పేర్కొంది.