ఆరోగ్యానికి తొలిసారి లక్ష కోట్లకుపైగా నిధులు
ABN , Publish Date - Feb 02 , 2026 | 03:32 AM
దేశంలో ఆరోగ్య సంరక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు బడ్జెట్‌లో తొలిసారి రూ.లక్ష కోట్లకుపైగా నిధులను కేంద్రం కేటాయించింది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: దేశంలో ఆరోగ్య సంరక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు బడ్జెట్‌లో తొలిసారి రూ.లక్ష కోట్లకుపైగా నిధులను కేంద్రం కేటాయించింది. ఈ రంగానికి రూ.1,04,599 కోట్లను ప్రతిపాదించింది. ఇది 2025-26 బడ్జెట్ కేటాయింపుల కంటే 10 శాతం ఎక్కువ.. ఆస్పత్రుల ఆధునికీకరణ, వైద్య సిబ్బందికి శిక్షణ, మౌలిక సదుపాయాల మెరుగుదలకు ఈ నిధులు వినియోగించనున్నారు. దేశాన్ని ప్రధాన వైద్య పర్యాటక గమ్యస్థానంగా మార్చేందుకు ప్రైవేటు రంగ భాగస్వామ్యంతో ఐదు ప్రాంతీయ వైద్య పర్యాటక కేంద్రాల (రీజినల్ మెడికల్ టూరిజం హబ్)ను ఏర్పాటు చేసి రాష్ట్రాలకు చేయూతనందిస్తామని కేంద్రం తెలిపింది. అపోలో, మ్యాక్స్, ఫోర్టిస్, డాక్టర్ లాల్‌పాత్‌ల్యాబ్స్, మెట్రోపొలిస్ ఇందుకు సహకరిస్తాయని వివరించింది. ‘కొత్తగా మూడు ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద సంస్థలను ఏర్పాటు చేయనున్నాం. సేవల నాణ్యతను పెంచడానికి ఆయుష్ ఫార్మసీలను, డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్‌లను అప్‌గ్రేడ్ చేస్తాం. ఇక మానసిక ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు బెంగళూరులోని నేషనల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సె్‌స-నిమ్హాన్స్ (ఎన్‌ఐఎంహెచ్‌ఏఎన్‌ఎ్‌స) తరహాలో ఉత్తర భారతదేశంలోనూ నిమ్హాన్స్ 2.0 ఏర్పాటు చేయనున్నాం. ’ అని వివరించింది. ‘దివ్యాంగ్ సహారా యోజన’ కింద అర్హులైన దివ్యాంగులు, వృద్ధులకు అధిక నాణ్యత కలిగిన సహాయక పరికరాలు అందించనున్నట్లు కేంద్రం పేర్కొంది. .
జాతీయ ఆరోగ్య మిషన్‌కు రూ.39,390 కోట్లు..
ఆరోగ్య సంరక్షణ రంగంలో జాతీయ ఆరోగ్య మిషన్‌కు రూ.39,390 కోట్లు కేటాయించారు. స్వయం ప్రతిపత్తిగల సంస్థలకు రూ.22,343.97 కోట్లు, ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీ-పీఎం-జేఏవై)కు రూ.9,500 కోట్లు ప్రతిపాదించారు. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్టక్చర్ మిషన్ (పీఎం-ఏబీహెచ్‌ఐఎం)కు రూ.4,200 కోట్లు కేటాయించారు.