Share News

అరుదైన ఖనిజాల కోసం కారిడార్లు

ABN , Publish Date - Feb 02 , 2026 | 04:07 AM

అరుదైన ఖనిజాల విషయంలో దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగా వాటిని ఉత్పత్తి చేసేందుకు కేంద్రం ప్రత్యేకంగా కారిడార్లను ఏర్పాటు చేయనుంది.

అరుదైన ఖనిజాల కోసం కారిడార్లు

  • ఒడిశా, ఏపీ, తమిళనాడు, కేరళల్లో ఏర్పాటు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: అరుదైన ఖనిజాల విషయంలో దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగా వాటిని ఉత్పత్తి చేసేందుకు కేంద్రం ప్రత్యేకంగా కారిడార్లను ఏర్పాటు చేయనుంది. ప్రత్యేక అరుదైన భౌగోళిక కారిడార్ల ఏర్పాటుకు ఖనిజాలు పుష్కలంగా ఉండే రాష్ట్రాలకు సహకరిస్తామని నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఈ కారిడార్లు ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కేరళలను అనుసంధానం చేస్తాయని చెప్పారు. అరుదైన ఖనిజాల మైనింగ్‌, ప్రాసెసింగ్‌, దేశీయంగా రవాణా చేయడానికి వ్యవస్థీకృత నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడానికి ఈ కారిడార్లను ప్రతిపాదించారు. అరుదైన ఖనిజాలను ఆధునిక సాంకేతిక పరికరాల్లో విరివిగా వినియోగిస్తారు. ప్రధానంగా ఎలక్ట్రిక్‌ వాహనాలు, పవన విద్యుత్‌ టర్బైన్లు, మొబైల్‌ ఫోన్లు, రక్షణ పరికరాలకు వీటి అవసరం ఉంటుంది. అలాంటి అరుదైన ఖనిజాల నిల్వలు పుష్కలంగా ఉన్న రాష్ట్రాలను అనుసంధానం చేయడం ద్వారా సప్లయ్‌ చైన్‌ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు తక్కువ ఖర్చు, సులువుగా వేగంగా దేశీయ ఉత్పత్తి సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నాలుగు రాష్ట్రాల్లో అరుదైన ఖనిజాల నిల్వలు ఉండటమే కాకుండా, తీర ప్రాంతం కూడా సుదీర్ఘంగా ఉంటుంది. ఖనిజాలను ప్రాసెస్‌ చేసే మౌలికసదుపాయాలు, ఇండస్ట్రియల్‌ జోన్లు, రవాణాకు అనువుగా ఉండే పోర్టులు ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రాంతాలకు సహకారం అందిస్తే, అరుదైన భూ ఖనిజాల ఉత్పత్తి విషయంలో దేశీయంగా ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేయవచ్చని కేంద్రం విశ్వసిస్తోంది.

Updated Date - Feb 02 , 2026 | 04:07 AM