Share News

హైటెక్‌ వ్యవసాయం..!

ABN , Publish Date - Feb 02 , 2026 | 04:09 AM

ప్రస్తుతం అనేక రంగాల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) హవా కొనసాగుతోంది..! అయితే.. వ్యవసాయంలోనూ దీన్ని సమర్థంగా వినియోగించుకునే దిశగా కీలక ముందడుగు పడింది.

హైటెక్‌ వ్యవసాయం..!

  • రైతుల కోసం ఏఐ ఆధారిత ‘భారత్‌ విస్తార్‌’

  • ప్రాంతీయ భాషల్లో సమగ్ర సమాచారం

  • రైతుల చేతికి కొత్త డిజిటల్‌ ఆయుధం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ప్రస్తుతం అనేక రంగాల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) హవా కొనసాగుతోంది..! అయితే.. వ్యవసాయంలోనూ దీన్ని సమర్థంగా వినియోగించుకునే దిశగా కీలక ముందడుగు పడింది. రైతుల చేతిలో సమగ్ర సమాచారం ఉంచే లక్ష్యంతో.. ‘భారత్‌ విస్తార్‌’ పేరిట కొత్త ఏఐ ఆధారితప్లాట్‌ఫామ్‌ను తీసుకొస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్‌లో ప్రకటించారు. ప్రాంతీయ భాషల్లో వ్యవసాయ సూచనలిచ్చే ఈ సాధనం ద్వారా రైతులకు అవసరమైన సమాచారం ఒకేచోట లభించేలా ఈ వ్యవస్థను రూపొందించారు. భారత్‌ విస్తార్‌ ద్వారా రైతులకు పంటలపై సలహాలు, వాతావరణ అంచనాలు, మార్కెట్‌ ధరల సమాచారం అందుతుంది. దీనివల్ల పంట నష్టాల ప్రమాదం తగ్గుతుంది. పంట ఉత్పాదకత పెరుగుతుంది. ఖర్చులు కూడా తగ్గుతాయి.

పల్లెలకు ఆదాయం, ఉపాధి..

గ్రామాల ఆదాయం, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం లక్ష్యంగా కేంద్ర బడ్జెట్‌లో వినూత్న ప్రతిపాదనలు చేశారు. కొత్తగా 500 చెరువుల అభివృద్ధి, కనీసం 20 వేలమందికి పశువైద్య నిపుణులుగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. పశు సంపద, మత్స్య ఉత్పత్తులతోపాటు ఉద్యానవన పంటలు, కోళ్ల పరిశ్రమ, సుగంధ మొక్కల పెంపకం తదితర వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు పెద్దపీట వేశారు. పశు సంపద రంగంలో రుణ ఆధారిత పెట్టుబడి రాయితీ పథకాన్ని తీసుకురావాలని, ప్రైవేటు రంగంలో వెటర్నరీ కాలేజీలు, ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్‌ ల్యాబ్‌లు, బ్రీడింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేయాలని ప్రతిపాదించారు. స్టార్ట్‌పలు, మహిళా సాగుదారుల సంఘాల సాయంతో మత్స్య పరిశ్రమకు ఊపు తీసుకురానున్నారు. ప్రపంచంలోనే కొబ్బరి సాగులో భారత్‌ ప్రథమ స్థానంలో ఉండగా, ఈ రంగాన్ని నమ్ముకుని కోటి మంది రైతులు సహా మొత్తం మూడు కోట్ల మంది జీవిస్తున్నారు. వీరికోసం ఆయా రాష్ట్రాల్లో పనికిరాని చెట్ల స్థానంలో అధిక దిగుబడినిచ్చే మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టనున్నారు. అధిక ఆదాయమిచ్చే జీడిపప్పు, కోకో, కొబ్బరి, గంధపు చెక్క, వాల్‌నట్స్‌, బాదం, పైన్‌ నట్స్‌ వంటి సాగు ప్రోత్సాహానికి ప్రాధాన్యమివ్వనున్నారు. జీడిపప్పు, కోకో ఉత్పత్తులకు 2030 నాటికి గ్లోబల్‌ బ్రాండ్‌ హోదా సాధించేందుకు చర్యలు తీసుకోనున్నారు.


సహకార సంఘాలకు పన్ను రాయితీలు

పశువుల దాణా, పత్తిగింజలు సరఫరా చేసే సహకార సంఘాలకు పన్నుల్లో రాయితీలను కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం పాలు, నూనె గింజలు, పండ్లు, కూరగాయలను పండించే, లేదా ఉత్పత్తి చేసే సభ్యులున్న ప్రాథమిక సహకార సంఘాలు వాటిని ఒక ఫెడరల్‌ సహకార సంఘానికి లేదా అలాంటి ఇతర సంస్థలకు సరఫరా చేయడం ద్వారా వచ్చే లాభాలు, ఆదాయాలపై పన్ను రాయితీలను కల్పిస్తున్నారు. ఈ రాయితీలను ఇప్పుడు పశువుల దాణా, పత్తి గింజల విషయంలోనూ వర్తింపచేయనున్నట్టు బడ్జెట్‌లో తెలిపారు.

Updated Date - Feb 02 , 2026 | 04:09 AM