Share News

మరో తొమ్మిదేళ్లలో 20 కోట్ల ఏసీలు!

ABN , Publish Date - Nov 23 , 2026 | 02:46 AM

దేశంలో ఏటా ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో చల్లదనం కోసం ఎక్కువ మంది ప్రజలు ఏసీ (ఎయిర్‌ కండిషనర్‌)ల వినియోగం వైపు మొగ్గుతున్నారు.

మరో తొమ్మిదేళ్లలో 20 కోట్ల ఏసీలు!

  • 2035 నాటికి దేశంలో కొత్తగా వాడకంలోకి వచ్చే ఏసీల సంఖ్య ఇది

  • భారీగా పెరగనున్న విద్యుత్‌ డిమాండ్‌

  • ప్రస్తుతం దేశంలో మొత్తంగా 1,641 టెరావాట్‌/అవర్‌ వినియోగం

  • 2035కి 2,891 టెరావాట్‌ డిమాండ్‌

  • అంతర్జాతీయ ఎనర్జీ ఏజెన్సీ నివేదిక

  • అమెరికా, జపాన్‌లో 90శాతం ఇళ్లలో ఏసీలు

  • భారత్‌లో ప్రస్తుతం 20శాతం ఇళ్లకే పరిమితం

న్యూఢిల్లీ, నవంబరు 22: దేశంలో ఏటా ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో చల్లదనం కోసం ఎక్కువ మంది ప్రజలు ఏసీ (ఎయిర్‌ కండిషనర్‌)ల వినియోగం వైపు మొగ్గుతున్నారు. వాటివల్ల విద్యుత్‌ డిమాండ్‌ పెరుగుతుండడంతో శిలాజ, శిలాజేతర ఇంధనాలతో విద్యుత్‌ ఉత్పత్తిని కంపెనీలు పెంచుతున్నాయి. దీనివల్ల వాతావరణంలో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతున్నాయి. ఈ వేడిని తట్టుకొనేందుకు మరింత మంది ప్రజలు ఏసీలు వాడుతున్నారు.. ఇలా దేశంలో విద్యుత్‌ వినియోగం అంతులేకుండా పెరుగుతోందని అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ (ఐఈఏ) తన ‘వరల్డ్‌ ఎనర్జీ ఔట్‌లుక్‌-2026’లో తెలిపింది. భారత్‌, ఆగ్నేయాసియా దేశాల్లో 2035 నాటికి ఏసీల వాడకం, విద్యుత్‌ వినియోగం ఎలా ఉండవచ్చన్నది ఈ నివేదిక అంచనా వేసింది. విద్యుత్‌ వినియోగం పెరగటంతో ప్రజలపై చార్జీల భారం కూడా పెరుగుతుందని పేర్కొంది. భారత్‌లో ప్రస్తుతం ఇళ్లు, కార్యాలయాల్లో చల్లదనం కోసం 10 కోట్ల ఏసీలు వాడుతున్నట్లు అంచనా. 2035 నాటికి కొత్తగా మరో 20 కోట్ల ఏసీలు వినియోగంలోకి వచ్చే అవకాశం ఉందని ఐఈఏ తెలిపింది.


వాతావరణంలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగితే ఏసీలు కూడా పెరుగుతాయని వెల్లడించింది. నిజానికి అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో 90 శాతం ఇళ్లలో ప్రస్తుతం ఏసీలు ఉన్నాయి. భారత్‌లో 20 శాతం లోపు ఇళ్లలోనే ఏసీలు ఉన్నాయి. ఉష్ణోగ్రతలు నిరంతరం పెరగుతుండటం, ప్రజల ఆదాయాల్లో వృద్ధి, పట్టణీకరణ వల్ల మనదేశంలో ఏసీలకు డిమాండ్‌ విపరీతంగా పెరుగుతోంది. భారత్‌లో ప్రజలు కొత్తగా ఏసీల వినియోగం ప్రారంభిస్తుండగా.. ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లో ఇళ్లలో ఇప్పటికే ఉన్న ఏసీల వినియోగం పెరుగుతోంది. ప్రస్తుతం ప్రపంచం మొత్తంగా చూస్తే గృహాల్లో వేడి కోసం అత్యధికంగా విద్యుత్‌ను వినియోగిస్తుండగా.. 2035 నాటికి చల్లదనం కోసం విద్యుత్‌ను అధికంగా వినియోగిస్తారని ఐఈఏ పేర్కొంది. అమెరికా, కెనడా, యూరప్‌ దేశాల్లో చలి అధికంగా ఉంటుంది కాబట్టి.. అక్కడ ఇళ్లను వెచ్చగా ఉంచుకొనేందుకు హీటర్లను వాడుతుంటారు.


విద్యుత్‌ డిమాండ్‌లో మనమే టాప్‌..

మనదేశంలో ఏసీల వినియోగంతో గృహ విద్యుత్‌ డిమాండ్‌ కూడా భారీగా పెరుగుతోంది. వచ్చే తొమ్మిదేళ్లలో ఏటా 6 శాతం చొప్పున వినియోగ విద్యుత్‌ డిమాండ్‌ పెరుగుతుందని ఐఈఏ తెలిపింది. విద్యుత్‌తోపాటు పెట్రోల్‌, డీజిల్‌, సహజవాయువు వంటి అన్ని రకాల ఇంధనాల డిమాండ్‌ కలిపి ఏటా 2.5 శాతం పెరుగుతుందని పేర్కొంది. ఇది ప్రపంచ ఇంధన డిమాండ్‌ పెరుగుదలకు ఏకంగా మూడు రెట్లు అధికమని వివరించింది. ప్రస్తుతం మనదేశంలో గంటకు 1,641 టెరావాట్ల (టీడబ్ల్యూహెచ్‌) వినియోగ విద్యుత్‌ డిమాండ్‌ ఉంది. 2025 లెక్కల ప్రకారం దేశంలో మొత్తం విద్యుత్‌ ఉత్పత్తి 2,114 టీడబ్ల్యూహెచ్‌ ఉంది. అది 2035 నాటికి 3,585 టీడబ్ల్యూహెచ్‌కు పెరుగుతుందని అంచనా. అప్పటికి వినియోగ విద్యుత్‌ డిమాండ్‌ కూడా 2,891 టీడబ్ల్యూహెచ్‌కు చేరుతుందని ఐఈఏ అంచనా వేసింది. విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్ల సొంత వినియోగం, సరఫరా నష్టాలను తీసివేయగా వాస్తవంగా ప్రజలు వినియోగించే విద్యుత్‌ మొత్తాన్ని వినియోగ విద్యుత్‌ అంటారు. 2035 నాటికి ప్రపంచవాప్తంగా కొత్తగా దాదాపు 1,700 టీడబ్ల్యూహెచ్‌ డిమాండ్‌ ఏర్పడుతుందని ఐఈఏ అంచనా వేసింది. అంటే.. మనదేశం మొత్తంలో ప్రస్తుతం ఉన్న డిమాండ్‌ కంటే అధికం.


తొమ్మిదేళ్లలో 51వాతం శిలాజేతర ఇంధనం!

మనదేశంలో ప్రస్తుతం ఉన్న ఇంధన డిమాండ్‌లో పెట్రోల్‌, డీజిల్‌, సహజవాయువు, నేలబొగ్గు లాంటి శిలాజ ఇంధనాల వాటానే అధికం. సౌర, పవన, అణు విద్యుత్‌ వంటి శిలాజేతర ఇంధనాల వాటా 28 శాతమే. 2035 నాటికి ఈ శిలాజేతర వినియోగ విద్యుత్‌ డిమాండ్‌ 51 శాతానికి పెరుగుతుందని ఐఈఏ అచనా వేసింది. దేశంలో వేగవంతమైన ఆర్థిక వృద్ధి, వాహనాల అధిక వినియోగం వంటివి కూడా ఇంధన డిమాండ్‌ పెరుగుదలకు కారణాలని పేర్కొంది. మనదేశంలో రోజుకు 12,000 కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయని అంచనా. వీటికి అధనంగా ఇంధనం కావాలి. అంతేకాకుండా వీటి తయారీకి అవసరమైన స్టీల్‌, ఇతర పదార్థాల ఉత్పత్తికి కూడా ఇంధనం కావాలి. వాహనాల మాన్యుఫ్యాక్చరింగ్‌కు కూడా ఇంధనం అవసరం. ఇవన్నీ కలిపి ఇంధన డిమాండ్‌ను విపరీతంగా పెంచుతాయని ఐఈఏ వెల్లడించింది. 2025తో పోల్చుకుంటే 2035 నాటికి దేశంలో ఇంధనరంగంలో పెట్టుబడులు 85 శాతం పెరుగుతాయని అంచనా వేసింది. అధిక ఇంధన వినియోగం వల్ల ఉష్ణోగ్రతలు కూడా మరింత పెరుగుతాయని పేర్కొంది.

Updated Date - Nov 23 , 2026 | 02:47 AM