యుద్ధంతో దేశంలోని వలస కార్మికులకు కష్టాలు
ABN , Publish Date - Apr 06 , 2026 | 03:56 AM
పశ్చిమాసియా యుద్ధం వల్ల ఏర్పడిన వంటగ్యాస్ కొరతతో సంబంధిత రంగాల్లో పనిచేసే వలస కార్మికులు ఉపాధి కోల్పోయి సొంతూర్లకు పయనమవుతున్నారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: పశ్చిమాసియా యుద్ధం వల్ల ఏర్పడిన వంటగ్యాస్ కొరతతో సంబంధిత రంగాల్లో పనిచేసే వలస కార్మికులు ఉపాధి కోల్పోయి సొంతూర్లకు పయనమవుతున్నారు. ఐదేళ్ల క్రితం కొవిడ్-19 ప్రభావంతో కోట్లాది మంది వలస కార్మికులు నగరాలను వీడి సొంతూర్లకు పయనమైన పరిస్థితి తాజాగా వంటగ్యాస్ సంక్షోభం వల్ల మరోసారి ఏర్పడింది. గత 30 రోజుల వ్యవధిలో అత్యధికంగా 1.5 లక్షల మందికిపైగా వలసకార్మికులు గుజరాత్‌లోని సూరత్ నగరం నుంచి సొంతూర్లకు వెళ్లిపోయారు. ముంబై, ఢిల్లీ, బిహార్ రాజధాని పట్నా తదితర నగరాల నుంచి కూడా భారీగా వలస కార్మికులు సొంతూర్లకు పయనమయ్యారు. ఈ పరిస్థితుల్లో సొంతూర్లకు వెళ్లడం మినహా మరో ప్రత్యామ్నాయం కనిపించడంలేదని పట్నాలోని దానాపూర్ రైల్వేస్టేషన్‌లో కొందరు వలసకార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ‘గ్యాస్ లేక.. పని కూడా లేదు.. వంట చేసుకునే అవకాశమూ లేదు. బయటి ఆహారం బాగా ఖరీదైపోయింది. అందుకే సొంతూర్లకు వెళ్లిపోతున్నాం’ అని చెప్పారు.