యుద్ధం ఎఫెక్ట్..ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో తగ్గిన ఎరువుల ఉత్పత్తి
ABN , Publish Date - Mar 07 , 2026 | 03:44 AM
ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావం యూరియా ఉత్పత్తిపై పడింది. ఇప్పటికే విదేశాల నుంచి భారత్‌కు దిగుమతి అయ్యే యూరియా రవాణాకు విఘాతం ఏర్పడింది.
ఖతార్ నుంచి అందించే గ్యాస్ సరఫరాలో కోత
యుద్ధం కారణంగా తీవ్రంకానున్న గ్యాస్ కొరత
రోజుకు 550టన్నుల యూరియా ఉత్పత్తి తగ్గింపు
రాష్ట్ర రైతాంగానికి యూరియా కష్టాలు తప్పవా?
కోల్‌సిటీ, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావం యూరియా ఉత్పత్తిపై పడింది. ఇప్పటికే విదేశాల నుంచి భారత్‌కు దిగుమతి అయ్యే యూరియా రవాణాకు విఘాతం ఏర్పడింది. దీనికి తోడు రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సీఎల్)లో యూరియా ఉత్పత్తిపైనా యుద్ధ ప్రభావం కనిపిస్తోంది. ఆర్‌ఎఫ్‌సీఎల్ గ్యాస్ ఆధారిత ఎరువుల కర్మాగారం. ఈ పరిశ్రమకు రోజుకు 2 మిలియన్ స్టాండర్డ్స్ క్యూబిక్ మీటర్ల రీగ్యాసీఫైడ్ లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఆర్‌ఎల్‌ఎన్‌జీ)ను వినియోగిస్తున్నారు. ఖతార్ నుంచి ఆర్‌ఎల్‌ఎన్‌జీని గుజరాత్‌లోని దహేజ టర్మినల్‌కు నౌకల ద్వారా తీసుకొస్తారు. అక్కడి నుంచి పెట్రోనెట్, ఎల్‌ఎన్‌జీ లిమిటెడ్ ద్వారా గ్యాస్ ఆథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(గెయిల్) పైప్‌లైన్ ద్వారా కాకినాడకు సరఫరా చేస్తుంది. అక్కడి నుంచి మల్లవరం - భోపాల్- బిల్వార గ్యాస్ పైప్‌లైన్ ద్వారా ఆర్‌ఎ్‌ఫసీఎల్‌కు గ్యాస్ సరఫరా అవుతుంది. కానీ ఖతార్‌లో ఎల్‌ఎన్‌జీ ఉత్పత్తి నిలిపివేయడం, నౌకల ద్వారా సరఫరా నిలిచిపోవడంతో గ్యాస్ కొరత ఏర్పడింది. దీంతో 10శాతం ఎల్‌ఎన్‌జీ సరఫరాలో కోత పెట్టారు. దీని కారణంగా ఆర్‌ఎ్‌ఫసీఎల్‌లో ఎరువుల ఉత్పత్తి తగ్గిపోయింది. ప్రస్తుతం 15శాతం యూరియా ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించారు. రోజుకు 3,850 టన్నుల యూరియా ఉత్పత్తి చేసే ఈ కర్మాగారంలో ప్రస్తుతం 3300 టన్నుల సరాసరి యూరియా ఉత్పత్తి జరుగుతున్నది. అంటే 550 టన్నుల మేరకు ఉత్పత్తి తగ్గింది. గ్యాస్ సరఫరాలో మరింత కోత విధిస్తే రాబోయే రోజుల్లో ఆర్‌ఎ్‌ఫసీఎల్‌లో యూరియా ఉత్పత్తి మరింత పడిపోయే ప్రమాదం ఉంది. యేటా ఇక్కడ ఉత్పత్తి అయ్యే యూరియాలో 40 నుంచి 45శాతం వరకు రాష్ట్రానికే కేటాస్తున్నారు. ఇక్కడ యూరియా ఉత్పత్తి తగ్గితే దీనిప్రభావం ప్రథమంగా రాష్ట్ర రైతాంగంపైనే పడనున్నది.