Share News

ఐడీబీఐ విక్రయంపై రగడ!

ABN , Publish Date - Oct 31 , 2026 | 03:12 AM

ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటీకరణ వ్యవహారం కేంద్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్‌కు మధ్య రాజకీయ యుద్ధానికి తెరలేపింది. లాభాల బాటలో పయనిస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకును విక్రయించాల్సిన..

ఐడీబీఐ విక్రయంపై రగడ!

  • కాంగ్రెస్‌ బ్యాంకులను నిర్మిస్తే..బీజేపీ సర్కారు అమ్ముకుంటోంది

  • కేంద్రంపై రాహుల్‌ గాంధీ ఆరోపణలు

  • ఐడీబీఐని రూ.25 వేల కోట్లతో మేమే పునరుద్ధరించాం: నిర్మలా సీతారామన్‌

న్యూఢిల్లీ, అక్టోబరు 30: ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటీకరణ వ్యవహారం కేంద్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్‌కు మధ్య రాజకీయ యుద్ధానికి తెరలేపింది. లాభాల బాటలో పయనిస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకును విక్రయించాల్సిన అవసరమేంటని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రశ్నిస్తుండగా.. కాంగ్రెస్‌ హయాంలో బ్యాంకింగ్‌ వ్యవస్థను రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నారని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల ఎదురుదాడికి దిగారు. ఐడీబీఐ బ్యాంకులో మెజారిటీ వాటాను విక్రయించాలన్న కేంద్రం నిర్ణయంపై రాహుల్‌తీవ్రంగా స్పందించారు. ఒకప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన బ్యాంకును ఉద్యోగుల కృషి, సమష్టి ప్రయత్నాలతో లాభాల బాటలోకి తీసుకొచ్చారని చెప్పారు. గత ఏడాది బ్యాంకు రూ.9 వేల కోట్లకు పైగా లాభాన్ని ఆర్జించిందని గుర్తుచేశారు. అలాంటి బ్యాంకును ప్రైవేటు సంస్థ చేతుల్లో పెట్టాల్సిన అవసరమేంటని శుక్రవారం రాహుల్‌ గాంధీ ‘ఎక్స్‌’లో ప్రశ్నించారు. కాంగ్రెస్‌ హయాంలో దేశ పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన ఆర్థిక వనరులు సమకూర్చేందుకు ఐడీబీఐ వంటి బ్యాంకులను ఏర్పాటు చేశారని, మోదీ హయాంలో వాటిని విక్రయిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ హయాంలో బ్యాంకులు ఏర్పాటయ్యాయని.. మోదీ హయాంలో అమ్ముకుంటున్నారని ఆరోపించారు. రాహుల్‌ విమర్శలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బదులిచ్చారు. కాంగ్రెస్‌ హయాంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలను వ్యక్తిగత ఆస్తుల్లా ఉపయోగించుకున్నారని ఆరోపించారు. రాజకీయ పలుకుబడితో బ్యాంకు ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చి, సరైన రుణ ప్రమాణాలను పక్కనపెట్టి పెద్ద వ్యాపార సంస్థలకు రుణాలు ఇప్పించారని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చే సమయానికి ఐడీబీఐ బ్యాంకు పరిస్థితి ఏమాత్రం బాగా లేదని, రూ.25 వేల కోట్లకు పైగా మూలధనాన్ని సమకూర్చి బ్యాంకును పునరుద్ధరించామని అన్నారు. కాంగ్రెస్‌ హయాంలో పలుకుబడి ఉన్నవారికి ఒక రకమైన బ్యాంకింగ్‌ విధానం, సామాన్యులకు మరో రకమైన విధానం ఉండేదని విమర్శించారు.


రూ.52,878 కోట్లకు ఫెయిర్‌ఫ్యాక్స్‌కు విక్రయం

ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటీకరణలో భాగంగా కెనడాకు చెందిన ఫెయిర్‌ఫ్యాక్స్‌ ఫైనాన్షియల్‌ హోల్డింగ్స్‌ సంస్థను వ్యూహాత్మక కొనుగోలుదారుగా కేంద్రం ఎంపిక చేసింది. ఈ నెల 14న కేంద్ర క్యాబినెట్‌ ఇందుకు ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన 30.48 శాతం, ఎల్‌ఐసీకి చెందిన 30.24 శాతం.. మొత్తం 60.72 శాతం వాటాను విక్రయించనున్నారు. ఈ లావాదేవీ విలువ సుమారు రూ.52,878 కోట్లు. ఇది భారత బ్యాంకింగ్‌ రంగంలో అతిపెద్ద విదేశీ పెట్టుబడి లావాదేవీల్లో ఒకటిగా నిలవనుంది.

Updated Date - Oct 31 , 2026 | 03:14 AM