Share News

పంట దిగుబడిని పెంచే విత్తనపూత

ABN , Publish Date - Jun 19 , 2026 | 02:49 AM

వాతావరణ మార్పులను తట్టుకుని.. పంట దిగుబడిని 12 నుంచి 37శాతం దాకా పెంచే ‘బయోపాలిమర్‌ ఆధారిత విత్తన పూత’ విధానాన్ని అభివృద్ధి చేసినట్టు హైదరాబాద్‌కు...

పంట దిగుబడిని పెంచే విత్తనపూత

  • కొత్త సాంకేతికతను అభివృద్ధి చేసిన ఐసీఏఆర్‌-ఐఐవోఆర్‌

  • ఈ విధానంతో 12 నుంచి 37శాతం దాకా పెరిగిన దిగుబడి

  • తెలంగాణలో 7 రకాల పంటలపై విజయవంతంగా పరీక్ష

న్యూఢిల్లీ, జూన్‌ 18: వాతావరణ మార్పులను తట్టుకుని.. పంట దిగుబడిని 12 నుంచి 37శాతం దాకా పెంచే ‘బయోపాలిమర్‌ ఆధారిత విత్తన పూత’ విధానాన్ని అభివృద్ధి చేసినట్టు హైదరాబాద్‌కు చెందిన ‘ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రిసెర్చ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయిల్‌ సీడ్స్‌ రిసెర్చ్‌ (ఐకార్‌-ఐఐవోఆర్‌)’ ప్రకటించింది. ఈ విధానంలో భాగంగా విత్తనాల చుట్టూ ఒక బయోడీగ్రేడబుల్‌ పొరను ఏర్పాటు చేస్తారు. అది విత్తనానికి అవసరమైన సూక్ష్మజీవులు, పోషకాలు, రక్షణ మందులను నేరుగా అందించే పొర. ఇవన్నీ భూమిలోనే అందడం వల్ల విత్తనం మొలకెత్తే సామర్థ్యం పెరుగుతుంది. తొలిదశలో మొక్క ఎదుగుదల చాలా బాగుంటుంది. నాటిన ప్రతి విత్తనమూ ఆరోగ్యంగా మొలకెత్తి, బలంగా ఎదగడం వల్ల సహజంగానే దిగుబడి పెరుగుతుంది. తెలంగాణలో సోయాబీన్‌, మొక్కజొన్న, వేరుశనగ, శనగ, పత్తి, ఆవాలు, కంది (మొత్తం 7రకాల) పంటలపై చేసిన పరీక్షల్లో ఇది రుజువైంది. మామూలు విత్తనాలతో వచ్చిన దిగుబడి కంటే ఈ పూతపూసిన విత్తనాల ద్వారా 12 నుంచి 37శాతం దాకా అధిక దిగుబడి వచ్చినట్టు ఐకార్‌ పరిశోధకులు తెలిపారు. ముఖ్యంగా.. వేరుశనగ, సోయాబీన్‌ పంటల దిగుబడి 30శాతం దాకా అదనంగా వచ్చినట్టు చెప్పారు. చిరుధాన్యాలు, తృణధాన్యాలు, పప్పుదినుసులు, కూరగాయలు, ఉద్యానవన పంటల విత్తనాలకూ ఈ సాంకేతికతను జోడించవచ్చని వారు వెల్లడించారు. వర్షాధార వ్యవసాయంపైన ఆధారపడే మనదేశానికి ఈ సాంకేతికత ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో.. ఈ సాంకేతిక సన్న, చిన్నకారు రైతులకు కూడా అందేలా చూసేందుకు ప్రభుత్వ విత్తన సంస్థలు, ప్రైవేటు విత్తన సంస్థలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలతో భాగస్వామ్యాలు ఏర్పరచుకునేందుకు ఐకార్‌ ప్రయత్నిస్తోంది.

Updated Date - Jun 19 , 2026 | 02:49 AM