తేజ్‌సల డెలివరీపై హాల్‌కు కొన్ని వెసులుబాట్లు
ABN , Publish Date - Feb 23 , 2026 | 01:38 AM
తేజస్ ఎంకే1ఏ యుద్ధ విమానాలు త్వరగా డెలివరీ అయ్యేలా భారత వైమానిక దళం (ఐఏఎఫ్) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఫైటర్ జెట్లను తయారు..
బెంగళూరు, ఫిబ్రవరి 22: తేజస్ ఎంకే1ఏ యుద్ధ విమానాలు త్వరగా డెలివరీ అయ్యేలా భారత వైమానిక దళం (ఐఏఎఫ్) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఫైటర్ జెట్లను తయారు చేస్తున్న హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హాల్)కు ఐఏఎఫ్ కొన్ని ఒప్పంద మినహాయింపులు మంజూరు చేసింది. ఇంజన్ సరఫరాలో జాప్యం, ఇతర సాంకేతిక ఇబ్బందుల వల్ల తేజ్‌సల డెలివరీ ఆలస్యం కావడంతో.. కీలకమైన ఆయుధ పరీక్షలు, రాడార్ ఏర్పాటు పూర్తయిన తర్వాత మిగిలిన చిన్న చిన్న పనులను వచ్చే ఏడాది పూర్తిచేసే షరతుతో ఐఏఎఫ్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే.. ఈ యుద్ధ విమానాల్లో అతి ముఖ్యమైన మిసైల్ ఫైరింగ్, రాడార్, ఎలకా్ట్రనిక్ వార్‌ఫేర్ సిస్టమ్‌ల అనుసంధానం, ఆయుధ ప్యాకేజీ వంటి మూడు పనులను మాత్రం ముందే పూర్తిచేయాలని ఐఏఎఫ్ స్పష్టం చేసింది. దీంతో తేజస్ ఎంకే1ఏ యుద్ధ విమానాలను త్వరగా డెలివరీ చేయడానికి హాల్‌కు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, భారత వాయుసేన మరో తేజస్ యుద్ధ విమానాన్ని కోల్పోయింది. శిక్షణ కోసం వినియోగిస్తున్న ఓ తేజస్ విమానం ఆదివారం కుప్పకూలింది. ఈ ఘటనలో పైలట్ ప్రాణాలతో బయటపడ్డారు. దీంతో ఇంతవరకు వాయుసేన మూడు తేజ్‌సలను నష్టపోయినట్టయింది.