భయపెట్టిన హైదరాబాద్-హుబ్బళ్లి విమానం
ABN , Publish Date - Apr 21 , 2026 | 03:15 AM
హైదరాబాద్‌లో నుంచి కర్ణాటక హుబ్బళ్లి వెళ్లే విమానం దిగడానికి అనువైన వాతావరణం లేకపోవడంతో గంటల కొద్దీ గాలిలోనే చక్కర్లు కొట్టింది.
ప్రతికూల వాతావరణంతో గాలిలోనే 4గంటలు చక్కర్లు
ప్రయాణికుల హాహాకారాలు.. బెంగళూరుకు మళ్లింపు
బెంగళూరు, శంషాబాద్ రూరల్, ఏప్రిల్ 20(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో నుంచి కర్ణాటక హుబ్బళ్లి వెళ్లే విమానం దిగడానికి అనువైన వాతావరణం లేకపోవడంతో గంటల కొద్దీ గాలిలోనే చక్కర్లు కొట్టింది. ఎంతసేపటికీ హుబ్బళ్లిలో వాతావరణం అనుకూలించపోవడంతో చివరకు విమానాన్ని బెంగళూరుకు మళ్లించారు. గాలిలో 4గంటల పాటు ప్రాణాలను అరచేత పట్టుకున్న ప్రయాణికులు ఎట్టకేలకు క్షేమంగా దిగారు. ప్రాణభయంతో ఏడుస్తున్న ఓ మహిళా ప్రయాణికురాలి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఫ్లై91 విమానయాన సంస్థకు చెందిన ఐసీ3401 విమానం ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు 22 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి హుబ్బళ్లికి బయలుదేరింది. షెడ్యూల్ ప్రకారం 4.30 సమయంలో ల్యాండ్ కావాలి. కానీ వాతావరణం అనుకూలించక సుమారు 4 గంటల పాటు దావణగెరె, శివమొగ్గ, హలియాళ, ముండగోడ తదితర ప్రాంతాల్లోని ఆకాశంలో ఆ విమానం చక్కర్లు కొట్టి రాత్రి 8 గంటల సమయంలో బెంగళూరులో దిగింది.