హైదరాబాద్‌లో మరిన్ని డేటా సెంటర్లు!
ABN , Publish Date - Feb 02 , 2026 | 03:44 AM
డేటా సెంటర్లకు పన్ను రాయితీ ప్రకటన హైదరాబాద్ నగరానికి ఉపయోగకరం కానుంది. భవిష్యత్తులో ఇక్కడ మరిన్ని డేటా సెంటర్ల ఏర్పాటుకు అవకాశం కలుగుతుందని ఐటీ నిపుణులు చెబుతున్నారు...
బడ్జెట్‌లో పన్ను రాయితీ ప్రకటనతో నగరానికి మేలు
రాష్ట్ర రాజధానిలో ఇప్పటికే 26కు పైగా డేటా సెంటర్లు
2047 వరకు ట్యాక్స్ హాలిడే ఇవ్వాలని కేంద్రం నిర్ణయం
హైదరాబాద్, ఫిబ్రవరి 1 (ఆంధ్ర జ్యోతి): డేటా సెంటర్లకు పన్ను రాయితీ ప్రకటన హైదరాబాద్ నగరానికి ఉపయోగకరం కానుంది. భవిష్యత్తులో ఇక్కడ మరిన్ని డేటా సెంటర్ల ఏర్పాటుకు అవకాశం కలుగుతుందని ఐటీ నిపుణులు చెబుతున్నారు. దేశంలో డిజిటల్ ఎకానమీని మరింత విస్తరించే దిశగా కేంద్రం పన్ను రాయితీని ప్రకటించింది. ఐటీ సేవలు, క్లౌడ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధ, ఫిన్‌టెక్, ఈ-కామర్స్ వంటి రంగాలన్నింటికీ డేటా నిల్వ, ప్రాసెసింగ్ కీలకం. ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్‌లో డేటా సెంటర్లకు భారీ ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. విదేశీ క్లౌడ్ కంపెనీలు దేశంలో ఉన్న డేటా సెంటర్ల సేవలను వినియోగించి, ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తే వారికి 2047 వరకు పన్ను మినహాయింపు(ట్యాక్స్ హాలిడే) ఇవ్వాలని ప్రతిపాదించింది. భారత్‌ను అంతర్జాతీయ క్లౌడ్ హబ్‌గా మార్చాలన్న వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్ వంటి అంతర్జాతీయ టెక్ దిగ్గజాలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే అవకాశం ఉంటుంది.
కాగా, హైదరాబాద్‌లో ఇప్పటికే 26 డేటా సెంటర్లు ఉన్నాయి. ఈ విషయంలో ముందున్న హైదరాబాద్‌కు పన్ను మినహాయింపు పథకం ద్వారా మరిన్ని ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం డేటా సెంటర్ విధానంతో పెట్టుబడులు ఆకర్షిస్తోంది. పన్ను రాయితీ రావడంతో విదేశీ కంపెనీలు హైదరాబాద్‌లో కొత్త యూనిట్లను ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంటుంది. దీంతో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఐటీ ఇంజనీర్లతోపాటు ఎలక్ట్రికల్, కూలింగ్, సెక్యూరిటీ రంగాల్లో వేలాది మందికి ఉపాధి దొరుకుతుంది. ఏఐ డిజిటల్ పరిశ్రమలకు బలం చేకూరుతుంది. డేటా సెంటర్ లేకుండా ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ సేవలు సాధ్యం కాదు.