కదలికలన్నీ పట్టేస్తా.. పనులన్నీ చేసేస్తా..
ABN , Publish Date - Nov 16 , 2026 | 02:53 AM
ఇన్నాళ్లూ మనుషులు కెమెరాల ద్వారా యంత్రాలను, వాటి పనితీరును పరిశీలించేవారు. ఇప్పుడు సీన్ మారిపోయింది. కృత్రిమ మేధకు, రోబోలకు శిక్షణ కోసం మనుషులే కెమెరాల ముందు నమూనాలుగా మారుతున్నారు.
మనుషుల కదలికలను పట్టేస్తున్న హ్యూమనాయిడ్ రోబోలు
పనుల్లో కచ్చితత్వం కోసమే.. రోబోలకు టెక్ సంస్థల శిక్షణ
వస్తువులు కస్టమర్లకు అందించడం, సర్దడం వంటి పనులు
బెంగళూరులో కూరగాయల విక్రేతల తలకు కెమెరాలు
టీ కెటిల్ కింద పడితే మనుషుల్లా వస్త్రంతో తుడిచే రోబో
పాప్‌కార్న్ నింపడం, సర్వ్ చేయడం వంటి వీడియోలు వైరల్
ఇన్నాళ్లూ మనుషులు కెమెరాల ద్వారా యంత్రాలను, వాటి పనితీరును పరిశీలించేవారు. ఇప్పుడు సీన్ మారిపోయింది. కృత్రిమ మేధకు, రోబోలకు శిక్షణ కోసం మనుషులే కెమెరాల ముందు నమూనాలుగా మారుతున్నారు. మనుషులు ఎలా నడుస్తారు? వస్తువులను ఎలా పట్టుకుంటారు? వంటి అంశాలను శాస్త్రవేత్తలు కెమెరాల్లో రికార్డు చేసి.. కృత్రిమ మేధ(ఏఐ), హ్యూమనాయిడ్ రోబోలకు శిక్షణ ఇచ్చేందుకు వినియోగిస్తున్నారు. తాజాగా బెంగళూరులోని ప్రముఖ కేఆర్ మార్కెట్‌లో పూలు, కూరగాయలు అమ్మే విక్రేతలు తలకు కెమెరాలు ధరించి వ్యాపారం చేస్తున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి. వస్తువులను పట్టుకోవడం, సర్దడం, వినియోగదారులకు అందించడం, రోజువారీ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే క్రమంలో వారి కదలికలను ఈ కెమెరాలు రికార్డు చేస్తున్నాయి. అయితే అక్కడ ఏ సంస్థ ఈ డేటాను సేకరిస్తుందన్నది తెలియలేదు. కానీ ప్రపంచ దిగ్గజ చిప్ సంస్థ ఎన్‌వీడియా మరెక్కడో ఇలా సేకరించిన డేటాతో హ్యూమనాయిడ్ రోబోలకు శిక్షణ ఇచ్చి, వాటి పనితీరుకు సంబంధించి వీడియోలను విడుదల చేసింది. విధ రంగాల్లో పనిచేసే మనుషుల కదలికలను తలపై అమర్చిన కెమెరాలు, మణికట్టు కెమెరాల ద్వారా రికార్డు చేస్తున్నారు. గృహాలు, పరిశ్రమలు, వ్యవసాయం, వాణిజ్య వంటశాలలు, రిటైల్ దుకాణాలు, సరకు రవాణా వంటి రంగాల్లోని పనులను చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే సుమారు పది లక్షల గంటల మానవ పనుల రికార్డింగ్‌తో డేటాను సిద్ధం చేశారు. ఈ డేటాను ఉపయోగించి అభివృద్ధి చేసిన ‘గ్రూట్-2’ వంటి ఫిజికల్ ఏఐ మోడళ్లు మనుషులు చేసే పనులను క్షుణ్నంగా అర్థం చేసుకుని, రోబోలతో వాటిని చేయించగలుగుతున్నాయి.
కదలికలను నేర్చుకోవడానికే
ఇప్పటివరకు ఏఐ శిక్షణ అంటే పుస్తకాలు, చిత్రాలు, ఇంటర్నెట్ సమాచారం ప్రధానంగా ఉండేవి. కానీ భౌతిక ప్రపంచంలో పనిచేసే రోబోలకు అంతకంటే భిన్నమైన సమాచారం అవసరం. మనిషి ఒక వస్తువును ఎలా పట్టుకుంటాడు? ఎంత ఒత్తిడి పెడతాడు? అడ్డంకి ఎదురైతే ఎలా స్పందిస్తాడు? వంటి సూక్ష్మ కదలికలూ తెలియాలి. అందుకోసం మనుషులు నిజ జీవితంలో చేసే పనులనే ప్రత్యక్షంగా రికార్డు చేస్తున్నారు. ఈ డేటా ఆధారంగా రోబోలు వస్తువులను పట్టుకోవడం, క్రమబద్ధంగా అమర్చడం, ప్యాకింగ్ చేయడం, వంట చేయడం వంటి పనులను నేర్చుకుంటున్నాయి.
-సెంట్రల్ డెస్క్