గోదావరిలో నీళ్లెన్ని?
ABN , Publish Date - Sep 08 , 2026 | 06:38 AM
తెలంగాణ ప్రయోజనాలకు అత్యంత కీలకమైన నీటి ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ మరోసారి అభ్యంతరాలు వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రాజెక్టులకు సాంకేతిక ఆమోదాలు, అనుమతులు ఇవ్వడాన్ని తప్పుబట్టింది. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ అధ్యక్షతన సోమవారం ఢిల్లీలో రెండు రాష్ట్రాల జలవివాదాల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది.
తాజాగా లెక్కలు తేల్చాలని డిమాండ్ చేసిన ఏపీ
కాళేశ్వరం, పాలమూరు, సమ్మక్కలకు అనుమతులపై అభ్యంతరాలు
సీడబ్ల్యూసీ తెలంగాణకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపణ
ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన అనుమతులేనని తేల్చిచెప్పిన తెలంగాణ
ఢిల్లీలో వాడివేడిగా జరిగిన జలవివాదాల సమన్వయ కమిటీ భేటీ
పది రోజుల్లో మరోసారి సమీక్షిద్దామన్న సీడబ్ల్యూసీ చైర్మన్
న్యూఢిల్లీ, హైదరాబాద్, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రయోజనాలకు అత్యంత కీలకమైన నీటి ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ మరోసారి అభ్యంతరాలు వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రాజెక్టులకు సాంకేతిక ఆమోదాలు, అనుమతులు ఇవ్వడాన్ని తప్పుబట్టింది. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ అధ్యక్షతన సోమవారం ఢిల్లీలో రెండు రాష్ట్రాల జలవివాదాల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, గోదావరిలో నీటి లభ్యతను తాజాగా తేల్చాలని ఈ సందర్భంగా ఏపీ డిమాండ్ చేసింది. గోదావరి నుంచి గత రెండు నెలల్లో 1,000టీఎంసీలు సముద్రం పాలయ్యాయని.. ఈ వృధా నీళ్లను వాడుకునేందుకు పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టు చేపట్టినట్టు తెలిపింది. ముఖ్యంగా గోదావరి జలాల్లో నీటి లభ్యత తేల్చకుండా, తమ అభ్యంతరాలను పట్టించుకోకుండా.. కాళేశ్వరం ప్రాజెక్టుకు సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) ఎలా ఆమోదం తెలుపుతుందని ఏపీ ప్రశ్నించింది.
అలాగే, సమ్మక్క, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వకూడదని.. ఏపీ జలవనరుల సలహాదారు వెంకటేశ్వరరావు కోరారు. సీడబ్ల్యూసీ తెలంగాణకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ వాదనను తెలంగాణ నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్‌దాస్, కార్యదర్శి శ్రీధర్ తీవ్రంగా ఖండించారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి, సమ్మక్క ప్రాజెక్టులకు 2014కు పూర్వమే అనుమతులు వచ్చాయని స్పష్టం చేశారు. గోదావరిలో నీటి లభ్యతపై 2023లో కేంద్ర జలసంఘం చేసిన అధ్యయనం తప్పని.. కొత్తగా మళ్లీ అధ్యయనం చేసి, ట్రైబ్యునల్ ద్వారా కేటాయింపులు తేల్చాలని ఏపీ అధికారులు పట్టుబట్టారు. గోదావరి నీటి లభ్యతపై కేంద్ర జలసంఘం లెక్కలు వాస్తవదూరంగా ఉన్నాయని ఏపీ అనడం హాస్యాస్పదమని తెలంగాణ అధికారులు పేర్కొన్నారు. శ్రీశైలం జలాశయం నుంచి తెలంగాణ విద్యుదుత్పత్తి చేయడాన్ని కూడా ఈ సమావేశంలో ఏపీ ప్రశ్నించింది. దీంతో ఈ అంశాలపై పది రోజుల్లో మరోసారి సమీక్ష నిర్వహిద్దామని జలసంఘం చైర్మన్ అన్నారు. అందుకు ముందస్తు అజెండా పంపాలని రెండు రాష్ట్రాలకు సూచించారు.