92 మంది సాక్షులూ అడ్డం తిరగడమేంటి?
ABN , Publish Date - Sep 29 , 2026 | 04:18 AM
సోహ్రాబుద్దీన్ షేక్ ఎన్‌కౌంటర్ కేసులో నిందితులందరినీ విడుదల చేయటాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారణకు తీసుకోవటానికి సుప్రీంకోర్టు అంగీకరించింది.
విచారణ నిష్పాక్షికంగానే జరిగిందా?
సోహ్రాబుద్దీన్ షేక్ ఎన్‌కౌంటర్ కేసుపై
జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చి వ్యాఖ్యలు
నిందితుల విడుదలను సవాల్ చేస్తూ
దాఖలైన పిటిషన్‌పై విచారణకు
సుప్రీంకోర్టు అంగీకారం
న్యూఢిల్లీ, సెప్టెంబరు 28: సోహ్రాబుద్దీన్ షేక్ ఎన్‌కౌంటర్ కేసులో నిందితులందరినీ విడుదల చేయటాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారణకు తీసుకోవటానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. సోహ్రాబుద్దీన్ షేక్ సోదరుడు నయాబుద్దీన్ షేక్ దాఖలు చేసిన పిటిషన్.. సోమవారం సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్ మోహనలతో కూడిన ధర్మాసనం ఎదుటకు వచ్చింది. నిందితుల విడుదలకు కారణమైన సాక్షుల వాంగ్మూలాల్లో కొన్నింటిని పరిశీలిస్తామని సీజేఐ పేర్కొన్నారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ సాక్షులుగా ఉన్న మొత్తం 92 మందీ తమ వైఖరిని మార్చుకోవటంపై జస్టిస్ బాగ్చీ కీలక వ్యాఖ్యలు చేశారు. సాక్షులందరూ అడ్డం తిరగటం పరిశీలించాల్సిన విషయమని, విచారణ నిష్పాక్షికంగా జరిగిందా అన్నది చూడాల్సి ఉందన్నారు. సోహ్రాబుద్దీన్ షేక్, ఆయన భార్య కౌసర్‌బీ, వారి సహాయకుడు తులసీరాం ప్రజాపతిలను 2005 నవంబరు 26-డిసెంబరు 27వ తేదీల మధ్య విడివిడిగా ఎన్‌కౌంటర్లలో పోలీసులు కాల్చి చంపారు. ఈ ఎన్‌కౌంటర్లన్నీ బూటకమని, వారిని హత్య చేశారని ఆరోపణలున్నాయి. ఈ కేసులో 22మంది నిందితులున్నారు. వీరిలో 21 మంది గుజరాత్, రాజస్థాన్ పోలీసులు కాగా.. మిగిలిన వ్యక్తి గుజరాత్‌లోని ఓ ఫాంహౌస్ యజమాని. ఈ కేసుపై విచారణ జరిపిన సీబీఐ కోర్టు 2018లో నిందితులందరినీ విడుదల చేసింది. దీనిని నయాబుద్దీన్ షేక్ బాంబే హైకోర్టులో సవాల్ చేయగా.. సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పునే హైకోర్టు సమర్థించింది. ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ వార్తలు కూడా చదవండి
రోడ్డు తనిఖీలో చెంపదెబ్బ వివాదం! ఢిల్లీ మంత్రి పర్వేష్ వర్మపై కేసు నమోదు
ఎల్‌పీయూలో భయానక రాత్రి.. ఆ రోజు ఏం జరిగింది..?