భార్య పని మనిషి కాదు.. ఆమె సేవలు అమూల్యం
ABN , Publish Date - Jun 23 , 2026 | 02:13 AM
‘ఇంటి పనులు చేసే గృహిణిని పని మనిషిగా చూడలేం. రోజుకు 24గంటలు వారానికి 7రోజులు ఆమె కుటుంబం కోసం కష్టపడుతుంది. ఆమె సేవలు అమూల్యమైనవి..
రోడ్డు ప్రమాదంలో మరణించిన గృహిణి కుటుంబానికి 39 లక్షలు పరిహారమివ్వాలని ‘చండీగఢ్ ట్రైబ్యునల్’ తీర్పు
ఛండీగఢ్, జూన్ 22: ‘ఇంటి పనులు చేసే గృహిణిని పని మనిషిగా చూడలేం. రోజుకు 24గంటలు వారానికి 7రోజులు ఆమె కుటుంబం కోసం కష్టపడుతుంది. ఆమె సేవలు అమూల్యమైనవి’ అంటూ ఛండీగఢ్ మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునల్(ఎంఏసీటీ) కీలక వ్యాఖ్యలు చేసింది. ఓ రోడ్డు ప్రమాదంలో మరణించిన 37ఏళ్ల గృహిణి కుటుంబానికి రూ.39.61 లక్షల పరిహారాన్ని ఖరారు చేసి.. బీమా సంస్థ చెల్లించాలంటూ తీర్పునిచ్చింది. హరియాణాకు చెందిన అనితా దేవి మహీంద్రా వ్యాన్‌లో వస్తుండగా అదుపు తప్పి పక్కనే ఉన్న నదిలోకి దూసుకెళ్లడంతో ఆమె మరణించారు. దీంతో రూ.50 లక్షల పరిహారం కోరుతూ భర్త, ఇద్దరు మైనర్ కూతుళ్లు పిటిషన్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా ట్రైబ్యునల్.. గృహిణి ఆదాయాన్ని నెలకు రూ.15 వేలుగా లెక్కగట్టి.. భవిష్యత్తు అవకాశాల కోసం దానిపై మరో 40శాతాన్ని కలిపి మొత్తం రూ.39.61 లక్షల పరిహారాన్ని బీమా సంస్థ చెల్లించాలంటూ ఆదేశించింది.