Share News

Hotel Penalized for Breach of Guest Privacy: హోటల్‌ గదిలో దంపతుల గోప్యతకు భంగం

ABN , Publish Date - Jan 08 , 2026 | 03:05 AM

హోటల్‌ గదిలో దంపతులు ఉండగా, హౌస్‌కీపింగ్‌ సిబ్బంది ఒకరు మాస్టర్‌ కీతో వారి గదిలోకి ప్రవేశించడాన్ని వినియోగదారుల కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది.

Hotel Penalized for Breach of Guest Privacy: హోటల్‌ గదిలో దంపతుల గోప్యతకు భంగం

  • ఉదయ్‌పూర్‌లోని లీలా ప్యాలె్‌సకు 10 లక్షల జరిమానా

ఉదయ్‌పూర్‌, జనవరి 7: హోటల్‌ గదిలో దంపతులు ఉండగా, హౌస్‌కీపింగ్‌ సిబ్బంది ఒకరు మాస్టర్‌ కీతో వారి గదిలోకి ప్రవేశించడాన్ని వినియోగదారుల కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఉదయ్‌పూర్‌లోని లీలా ప్యాలెస్‌ హోటల్‌ యాజమాన్యానికి రూ.10 లక్షల జరిమానా విధించింది. వారు చెల్లించిన అద్దె రూ.55 వేలను 9 శాతం వడ్డీతో వాపస్‌ చేయాలని, లిటిగేషన్‌ ఖర్చుల నిమిత్తం మరో రూ.10 వేలు ఇవ్వాలని ఆదేశించింది. ఈ తీర్పు ఇచ్చిన రెండు నెలల్లోపు ఈ మొత్తం బాధితులకు చెల్లించాలని గతనెల 16న ఆదేశించింది. చెన్నైకి చెందిన మహిళా న్యాయవాది 2025 జనవరి 26న తన భర్తతో కలిసి ఈ హోటల్‌లోని లేక్‌ వ్యూ ఉన్న గ్రాండ్‌ రూమ్‌లో దిగారు. తామిద్దరం బాత్రూమ్‌లో ఉన్న సమయంలో హోటల్‌ సిబ్బంది ఒకరు మాస్టర్‌ కీతో లోపలికి వచ్చేశారని ఆమె ఆరోపించారు. అప్పటికీ ‘నో సర్వీస్‌’ అని తాము అరుస్తూనే ఉన్నామని, అయినా పగిలిన బాత్రూమ్‌ డోర్‌లోంచి లోనికి తొంగి చూశారని ఆమె తెలిపారు. ఇది తమ ప్రైవసీకి తీవ్రంగా భంగం కలిగించడంతోపాటు, మానసికంగా కుంగుబాటుకు గురిచేసిందని పేర్కొన్నారు. ఇది సేవాలోపం కిందకి కూడా వస్తుందని చెన్నై(నార్త్‌)లోని జిల్లా వినియోగదారుల కోర్టు అభిప్రాయపడింది.

Updated Date - Jan 08 , 2026 | 03:05 AM