Share News

భారత్‌కు సున్నా ట్యాంకర్లు!

ABN , Publish Date - Mar 03 , 2026 | 04:42 AM

హోర్ముజ్‌ జలసంధిలో ట్యాంకర్ల జామ్‌ ప్రభావం భారత్‌పై తీవ్రంగా పడుతోంది. మనం దిగుమతి చేసుకునే మొత్తం చమురులో 60-65 శాతం ఈ మార్గం గుండానే వస్తుంది.

భారత్‌కు సున్నా ట్యాంకర్లు!

  • మనం కొనే చమురులో 60-65 శాతం హోర్ముజ్‌ జలసంధి గుండా రావాల్సిందే

  • ప్రస్తుత పరిస్థితులతో నిలిచిన ట్యాంకర్లు

హోర్ముజ్‌ జలసంధిలో ట్యాంకర్ల జామ్‌ ప్రభావం భారత్‌పై తీవ్రంగా పడుతోంది. మనం దిగుమతి చేసుకునే మొత్తం చమురులో 60-65 శాతం ఈ మార్గం గుండానే వస్తుంది. ఇరాక్‌, సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాల నుంచి మనం కొనే చమురంతా ఈ జలసంధి ద్వారానే రావాలి. అలా ఈ మార్గంలో రోజుకు సగటున 4-5 ట్యాంకర్లు భారత్‌కు వస్తాయి. నెలకు 120 నుంచి 150 ట్యాంకర్లు మన పశ్చిమ తీరంలోని జామ్‌నగర్‌, మంగళూరు, ముంబై, ముంద్రా వంటి రేవులకు చేరుకుంటాయి. కానీ, సోమవారానికి ఈ జలసంధి గుండా మనదేశానికి వచ్చే ట్యాంకర్ల సంఖ్య సున్నాకు పడిపోయింది. అంటే రోజుకు 40-50 లక్షల బ్యారెళ్ల చమురు సరఫరా ఆగిపోయినట్టే. సహజంగా మనవద్ద 9 నుంచి 12 రోజులకు సరిపడా అత్యవసర చమురు నిల్వలు ఉంటాయి. యుద్ధ ప్రభావం ఇలాగే కొనసాగి మనకు సుదీర్ఘకాలం పాటు హోర్ముజ్‌ గుండా వచ్చే చమురు సరఫరా నిలిచిపోతే భారత్‌ తీవ్రంగా ఇబ్బంది పడుతుంది. ఈ నేపథ్యంలో భారత సర్కారు అప్రమత్తమై ఇతర దేశాల (రష్యా, నైజీరియా, అంగోలా, అమెరికా) నుంచి ఎక్కువ చమురు కొనుగోలు చేసేందుకకు ప్రయత్నాలు ప్రారంభించింది. దీంతోపాటు, 2019లో ఓమన్‌ గల్ఫ్‌లో ట్యాంకర్లపై దాడులు జరిగినప్పుడు భారతదేశం ‘ఆపరేషన్‌ సంకల్ప్‌’ పేరిట మన యుద్ధనౌకలను అక్కడ మన చమురు ట్యాంకర్లకు రక్షణగా మోహరించిన సంగతి తెలిసిందే. ఆ యుద్ధనౌకలు, నిఘా విమానాల రక్షణలో మన చమురు ట్యాంకర్లను సురక్షితంగా భారత్‌కు తీసుకొచ్చేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మన యుద్ధనౌకలు జీపీఎ్‌సతో కాకుండా.. మనం సొంతంగా అభివృద్ధి చేసుకున్న నావిక్‌ నేవిగేషన్‌తో పనిచేస్తాయి కాబట్టి, జీపీఎస్‌ జామింగ్‌తో వాటికి ఇబ్బంది ఉండదు. అయితే, అందుకు 3-4 రోజుల సమయం పడుతుందని ప్రభుత్వ వర్గాల అంచనా.


మరో సమస్య..

హోర్ముజ్‌ జలసంధి ప్రస్తుతం డిజిటల్‌ యుద్ధక్షేత్రంగా మారడంతో ఇన్సూరెన్స్‌ కంపెనీలు చమురు నౌకలకు బీమా ఇవ్వడానికి సిద్ధపడట్లేదు. ఇచ్చినా.. అధిక ప్రీమియం చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. గతంలో చెల్లించినదానికంటే ఒక్కో ట్యాంకర్‌కు 2 లక్షల నుంచి 5 లక్షల డాలర్ల దాకా (రూ.1.8 కోట్ల నుంచి రూ.4.5 కోట్ల దాకా) ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి వస్తోందని షిప్పింగ్‌ కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే, ఆ భారం షిప్పింగ్‌ కంపెనీలు మోయవని.. చివరికి అది వినియోగదారులపైనే పడుతుందని వాణిజ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎగుమతులపైనా..

హోర్ముజ్‌ జలసంధిలో డిజిటల్‌ చీకటి దెబ్బకు.. మన చమురు దిగుమతులపైనే కాదు, గల్ఫ్‌ దేశాలకు ఎలకా్ట్రనిక్‌ ఉత్పత్తుల ఎగుమతులపైనా ప్రభావం పడుతోంది. ఏటా భారత్‌ నుంచి 4.5 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.37 వేల కోట్ల) విలువైన ఎలకా్ట్రనిక్‌ ఉత్పత్తులు గల్ఫ్‌ దేశాలకు ఎగుమతి అవుతాయి. 2025 ఏప్రిల్‌ నుంచి డిసెంబరు మధ్య ఒక్క యూఏఈనే 4.1 బిలియన్‌ డాలర్ల ఉత్పత్తులను దిగుమతి చేసుకుంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

- సెంట్రల్‌ డెస్క్‌

Updated Date - Mar 03 , 2026 | 04:42 AM