మన జేబుకు ‘హోర్ముజ్’ చిల్లు!
ABN , Publish Date - Jun 01 , 2026 | 04:12 AM
రాజకీయాలపై పట్టింపులేదు.. ఎక్కడేం జరుగుతోందో అవసరం లేదు.. మనమేంటో, మన సమస్యలేమిటో.. మన పనేమిటో అంతే! కానీ ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న హోర్ముజ్ జలసంధి మన....
నిత్యావసరాల నుంచి ఎలక్ట్రానిక్స్ దాకా.. దాదాపు అన్నింటి ధరలూ పైపైకి
సరఫరా వ్యవస్థలు దెబ్బతినడం,పెట్రోలియం ధరల పెరుగుదల ప్రభావం
లీటరుకు రూ.2 చొప్పున పెరిగిన పాల ధర
15-20శాతం పెరిగిన వంట నూనెల భారం
న్యూఢిల్లీ, మే 31: రాజకీయాలపై పట్టింపులేదు.. ఎక్కడేం జరుగుతోందో అవసరం లేదు.. మనమేంటో, మన సమస్యలేమిటో.. మన పనేమిటో అంతే! కానీ ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న హోర్ముజ్ జలసంధి మన వంటింట్లో మంటలు సృష్టిస్తోంది. ప్రజల జేబులకు చిల్లులు పెడుతోంది. పొద్దున్నే తాగే టీ, కాఫీ మొదలు కూరగాయలు, ఆహార పదార్థాలు, నిత్యావసరాల నుంచి ఎలక్ట్రానిక్స్ దాకా అన్నింటి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. హోర్ముజ్ జలసంధి మూసివేతతో సరఫరా వ్యవస్థలు దెబ్బతినడం, పతనమైన రూపాయి విలువ, పెరిగిపోయిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతో తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. ముఖ్యంగా మే 15 నుంచి రెండు వారాల్లోనే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రూ.7.5 పెరిగాయి. దీనితో రవాణా వ్యయం పెరిగి.. నిత్యావసరాల ధరలపై ప్రభావం మొదలైంది.
ఇటీవలే అమూల్, మదర్ డెయిరీ సహా చాలా సంస్థలు పాల ధరలను లీటరుకు రూ.2 చొప్పున పెంచాయి. పెరుగు, పనీర్ సహా పాలతో తయారయ్యే ఇతర పదార్థాల ధరలూ 10శాతం వరకు పెరగాయి.
ముడి పదార్థాలు, ప్యాకేజింగ్ ధరలు పెరిగిన నేపథ్యంలో మోడర్న్, బ్రిటానియా తదితర సంస్థలు 500గ్రాముల బ్రెడ్ ప్యాకెట్ల ధరలను రూ.5 మేర పెంచేశాయి. మరికొన్ని సంస్థలూ పెంచనున్నట్టు ప్రకటించాయి.
భారత్ భారీ స్థాయిలో వంట నూనెలను దిగుమతి చేసుకుంటుంది. చమురు ధరల పెరుగుదల, రూపాయి పతనంతో వాటిపై ప్రభావం పడింది. దీనితో వంట నూనెను బట్టి 15 శాతం నుంచి 20శాతం వరకు ధరలు పెరిగాయి.
మన దేశం పప్పులను కూడా భారీగా దిగుమతి చేసుకుంటుంది. వాటిపైనా హోర్ముజ్ ప్రభావం, రూపాయి పతనం ప్రభావం పడినా.. కేంద్ర ప్రభుత్వం ఇటీవల దిగుమతులపై పన్నును తగ్గించడంతో ఉపశమనం లభించింది. కానీ రవాణా వ్యయ భారంతో ధరలు పెరిగాయి.
పెరిగిన రవాణా వ్యయానికి తోడు వేసవి కావడంతో కూరగాయల ధరలూ చుక్కలను తాకుతున్నాయి. ఉల్లి, టమాటా, సోయాబీన్, చిక్కుడు వంటివాటి ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయి.
వంటగ్యాస్ ధరల పెంపుతో గృహ వినియోగంపై 7శాతం వరకు భారం పడితే.. వాణిజ్య వినియోగంపై మాత్రం ఏకంగా 60శాతం అదనపు భారం పడింది. హోటళ్లు, రెస్టారెంట్లు ధరలు పెంచేయడంతో ఆ భారం వినియోగదారులపైకి మళ్లింది. రోడ్డుపక్కన తినుబండారాల నుంచి రెస్టారెంట్లలో ఆహారం వరకు ధరలు 20-30 శాతం పెరిగిపోయాయి.
ముడిపదార్థాలు, ప్యాకేజింగ్, రవాణా వ్యయం పెరగడంతో ఎఫ్‌ఎంసీజీ సంస్థలు ధరలు పెంచుతున్నాయని సిస్టమాటిక్స్ రీసెర్చ్ సంస్థ తాజా నివేదికలో పేర్కొంది. ఇప్పటికే పలు సంస్థలు 3-7శాతం వరకు ధరలు పెంచాయని తెలిపింది. త్వరలోనే షాంపూలు, సబ్బులు, టూత్‌పేస్టులు, ఇతర వ్యక్తిగత, గృహ సంబంధిత వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.
చాలా వరకు ఎలక్ట్రానిక్స్ వస్తువుల ధరలను కంపెనీలు 10-15శాతం మేర పెంచేశాయి. దిగుమతి చేసుకునే విడిభాగాలు, కంప్యూటర్ చిప్స్‌కు అయ్యే వ్యయం పెరగడం, చమురు ఉత్పన్నాల నుంచి తయారుచేసే వివిధ రకాల ప్లాస్టిక్ ధరల మోతతో.. పరికరాల ఉత్పత్తి వ్యయం పెరిగిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.