Share News

సరిగమల వెనక గరళం

ABN , Publish Date - Nov 23 , 2026 | 03:38 AM

కర్ణాటకకు చెందిన ప్రముఖ వాయులీన విద్వాంసుడు హెచ్‌ఎన్‌ భాస్కర్‌ (50).. మైనర్‌పై లైంగిక నేరాలకు పాల్పడ్డ కేసులో అమెరికాలో అరెస్టయ్యారు.

సరిగమల వెనక గరళం

  • మైనర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. అమెరికాలో అరెస్టయిన వాయులీన విద్వాంసుడు హెచ్‌.ఎన్‌.భాస్కర్‌

  • కర్ణాటక సంగీత ప్రపంచంలో ఇలాంటి వారు చాలా మంది తమ ముఠాల రక్షణలో ఉన్నారు

  • వారు విదేశాల్లో అరెస్టు కావాలని ప్రార్థించడం తప్ప ఎవరూ ఏమీ చేయలేరు: చిన్మయి శ్రీపాద

  • గతంలోనూ పలువురు సంగీత విద్వాంసులపై ఆరోపణలు

న్యూఢిల్లీ, నవంబరు 22: కర్ణాటకకు చెందిన ప్రముఖ వాయులీన విద్వాంసుడు హెచ్‌ఎన్‌ భాస్కర్‌ (50).. మైనర్‌పై లైంగిక నేరాలకు పాల్పడ్డ కేసులో అమెరికాలో అరెస్టయ్యారు. ప్రస్తుతం ఆయన మస్సాచుసెట్స్‌లోని బోస్టన్‌ జైల్లో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ఏడాది సెప్టెంబరు 4-26 నడుమ కాలిఫోర్నియాలో 18 ఏళ్లలోపు బాలికపై ఆయన లైంగిక నేరాలకు పాల్పడినట్టు పేర్కొంటూ పోలీసులు నాలుగు అభియోగాలు నమోదు చేశారు. ప్రముఖ సంగీత విద్వాంసుడు టి.ఎం.కృష్ణ, గాయని చిన్మయి శ్రీపాద దీనిపై ‘ఎక్స్‌’లో స్పందించారు. రెండు దశాబ్దాలకు పైగా భాస్కర్‌తో కలిసి అనేక కచేరీలు చేసిన టి.ఎం.కృష్ణ.. దీనిపై తీవ్ర విచారం, ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం జరగాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. సినిమా, సంగీతం సహా పలు రంగాల్లో మహిళలపై జరిగే లైంగిక వేధింపులపై తరచూ గళమెత్తే చిన్మయి శ్రీపాద.. ఈ వార్త తనకు ఏమాత్రం ఆశ్చర్యం కలిగించలేదని, కర్ణాటక సంగీత విద్వాంసుల్లో ఇలాంటివారు చాలామంది ఉన్నారని.. వారంతా తమ గ్రూపులు, ముఠాల రక్షణలో ఉన్నారని ‘ఎక్స్‌’లో ఒక పోస్టు పెట్టారు. ఇదే తరహాలో విద్యార్థులతో పదేపదే అసభ్యంగా వ్యవహరించే మరో వాయులీన విద్వాంసుడు ఉన్నాడని ఆమె ఆరోపించారు. ‘‘శాస్త్రీయ సంగీత రంగంలో ఇలాంటివారు ఎంతోమంది బహిరంగంగా, గర్వంగా, పశ్చాత్తాపం లేకుండా భక్తి ముసుగులో ఉన్న తోడేళ్లలా తిరుగుతున్నారు. వారు విదేశాల్లో అరెస్టు కావాలని ప్రార్థించడం, ఆశించడం తప్ప ఎవరూ ఏమీ చేయలేరు. ఎందుకంటే భారతదేశంలో అది ఎప్పటికీ జరగదు’’ అని ఆమె వాపోయారు. కర్ణాటక, హిందుస్థానీ సంగీత రంగాలకు సంబంధించిన ప్రముఖులపై ఇలాంటి ఆరోపణలు గతంలో కూడా వచ్చాయి.


ఉదాహరణకు.. 2018లో ‘మీటూ ఉద్యమం’ సమయంలో ఓఎస్‌ త్యాగరాజన్‌, చిత్రవీణ విద్వాంసుడు ఎన్‌.రవికిరణ్‌, వయొలినిస్ట్‌ నాగై శ్రీరామ్‌, మృదంగం విద్వాంసులు మన్నార్‌గుడి ఎ.ఈశ్వరన్‌, శ్రీముష్ణం వి.రాజారావు, ఆర్‌.రమేశ్‌, తిరువారూర్‌ వైద్యనాథన్‌లపై పలువురు మహిళా విద్యార్థులు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. దీంతో మద్రాస్‌ మ్యూజిక్‌ అకాడమీ వారిని మార్గళి ఉత్సవాల్లో పాల్గొనకుండా నిషేధించింది. అలాగే.. చెన్నైలోని తొమ్మిది ప్రధాన సభలు వారిమీద వచ్చిన ఆరోపణలపై అంతర్గత ఫిర్యాదుల కమిటీలను ఏర్పాటు చేశాయి. 2020లో భోపాల్‌కు చెందిన హిందుస్థానీ సంగీత విద్వాంసులు, గుండేచా బ్రదర్స్‌గా పేరొందిన అఖిలేశ్‌ గుండేచా, ఉమాకాంత్‌ గుండేచా, రమాకాంత్‌ గుండేచాలపై కూడా లైంగికవేధింపులు, అత్యాచార ఆరోపణలు వచ్చాయి. కథక్‌ దిగ్గజం బిర్జూమహరాజ్‌ చనిపోయిన తర్వాత.. పలువురు నర్తకులు ఆయన, ఆయన శిష్యుల్లో కొందరు తమతో అసభ్యంగా ప్రవర్తించినట్టు ఆరోపించారు.

Updated Date - Nov 23 , 2026 | 03:44 AM