Ahmedabad: చరిత్ర పునాదిపై ఆధునిక బంధం
ABN , Publish Date - Jan 13 , 2026 | 05:47 AM
ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం దిశగా ప్రధాని మోదీ, జర్మనీ చాన్స్‌లర్ మెర్జ్ మధ్య సోమవారం విస్తృతంగా చర్చలు జరిగాయి.
జర్మనీ చాన్స్‌లర్ మెర్జ్‌తో మోదీ చర్చలు
అహ్మదాబాద్‌లో అంతర్జాతీయ
పతంగుల పండుగ ప్రారంభించిన ఇరువురు నేతలు
గాంధీనగర్/అహ్మదాబాద్, జనవరి 12: ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం దిశగా ప్రధాని మోదీ, జర్మనీ చాన్స్‌లర్ మెర్జ్ మధ్య సోమవారం విస్తృతంగా చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా విద్యారంగంలో మెరుగైన సంబంధాల కోసం ఇరుదేశాల మధ్య ఓ రోడ్‌మ్యాప్ తయారీకి అడుగులు పడ్డాయి. చాన్స్‌లర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మెర్జ్ తొలిసారిగా ఆసియా పర్యటనకు వచ్చారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మొదటగా భారత్‌లో రెండు రోజుల పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సోమవారం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు వచ్చిన ఆయనకు ప్రధాని మోదీ స్వాగతం పలికారు. మెర్జ్‌తో భేటీ అనంతరం సంయుక్త మీడియా సమావేశంలో మోదీ మాట్లాడారు. జర్మనీ మేధో, రాజకీయ స్వరూపాన్ని తీర్చిదిద్దడంలో భారతీయ మేధావులు, స్వాతంత్య్ర సమరయోధుల పాత్రను ఈ సందర్భంగా ప్రధాని గుర్తుచేశారు. ఠాగూర్ సాహిత్యం, వివేకానంద తాత్వికం నుంచి జర్మనీలో మేడమ్ కామా తొలి భారత జాతీయ జెండాను ఎగురవేయడం వరకూ ప్రస్తావించారు. ఆ చారిత్రక బంధం నేడు భవిష్యత్ భాగస్వామ్యానికి పునాదిగా నిలుస్తోందని చెప్పారు. భారత్, జర్మనీ ద్వైపాక్షిక వాణిజ్యం గతంలో ఎప్పుడూ లేనంత ఉచ్చస్థితికి చేరుకుందని, 50 బిలియన్ డాలర్ల మార్క్‌ను దాటిందని పేర్కొన్నారు. 2 వేలకు పైగా జర్మనీ కంపెనీలు భారత్‌లో చాలా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, భారత్ ఆర్థిక పరిస్థితి, వృద్ధి సామర్థ్యంపై నమ్మకానికి ప్రతిరూపంగా అవి నిలుస్తున్నాయని చెప్పారు.
గాంధీ భోదనలు ఇప్పుడే అవసరం: మెర్జ్
మహాత్మాగాంధీ భోదనలు ప్రపంచానికి గతంలో కంటే ఇప్పుడే ఎక్కువ అసరమని మెర్జ్ అభిప్రాయపడ్డారు. ఇరువురు నేతలు సబర్మతి ఆశ్రమంలో మహాత్మాగాంధీకి పుష్పాంజలి ఘటించారు. తర్వాత సబర్మతీ రివర్‌ఫ్రంట్ వద్ద మెర్జ్, మోదీ కలసి అంతర్జాతీయ పతంగుల వేడుకలను ప్రారంభించారు. ఓపెన్ టాప్ జీప్‌లో ఉండి పతంగులను ఎగురవేశారు. బుధవారం వరకు ఈ పతంగుల పండుగ జరగనుంది. మీడియా సమావేశంలో మెర్జ్ మాట్లాడుతూ, ఇరు దేశాల మధ్య సంబంధాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నానని చెప్పారు. తనను గుజరాత్‌కు ఆహ్వానించడాన్ని స్నేహబంధానికి ప్రతీకగా పేర్కొన్నారు.
ఇరు దేశాల మధ్య 19 ఒప్పందాలు
రక్షణ, వాణిజ్యం, కీలకమైన ఖనిజాలు, సెమీ కండక్టర్స్ తదితర అంశాల్లో సహకారాన్ని పెంపొందించుకోవాలని జర్మనీ, భారత్ నిర్ణయించాయి. భౌగోళిక రాజకీయ సవాళ్లను ఉమ్మడిగా ఎదుర్కోవడానికి ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేసుకోవాలని నిర్ణయించాయి. ప్రధాని మోదీ, చాన్స్‌లర్ మెర్జ్ చర్చల తర్వాత 19 ఒప్పందాలపై ఇరు పక్షాలు సంతకాలు చేశాయి.