Share News

హిమంత మ్యాజిక్‌!

ABN , Publish Date - May 05 , 2026 | 05:18 AM

అస్సాం ఎన్నికల్లో ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ మ్యాజిక్‌ బాగా పనిచేసింది. వరుసగా రెండోసారి ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారు.

హిమంత మ్యాజిక్‌!

అస్సాం ఎన్నికల్లో ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ మ్యాజిక్‌ బాగా పనిచేసింది. వరుసగా రెండోసారి ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారు. బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే కూటమికి అస్సాంలో ఇది హ్యాట్రిక్‌ విజయం. ఒకప్పుడు కాంగ్రెస్‌ నేతగా ఉన్న ఆయన ఇప్పుడు బీజేపీ విజయంలో కీలకపాత్ర పోషించారు. 2015లో హిమంత కాంగ్రెస్‌ నుంచి బయటికి రావడం.. 2016 నుంచి బీజేపీ గెలుపులో కీలకంగా మారింది. అక్రమ వలసలు, సంక్షేమ పథకాలు తదితర స్థానిక అంశాలపై ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలో వ్యూహాత్మకంగా దృష్టి కేంద్రీకరించడం అస్సాంలో బీజేపీ బలం పెరగడంలో కీలకపాత్ర పోషించింది. 2016 ఎన్నికలకు కొద్దికాలం ముందు మాత్రమే అస్సాంలో బీజేపీ ఎదుగుదల మొదలైంది. 1979-85 మధ్య బంగ్లాదేశ్‌ అక్రమ వలసదారులకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమం బీజేపీ పట్టును పెంచింది. ఐఎండీటీ చట్టాన్ని రద్దు చేస్తామని, ఎన్‌ఆర్‌సీని అప్‌డేట్‌ చేస్తామనే హామీలతో అస్సాం ప్రజలకు ఆ పార్టీ చేరువైంది. ఇక, 2014లో అక్రమ చొరబాట్లపై ప్రధాని మోదీ ఇచ్చిన హామీలు ఎగువ అస్సాంలోనూ, బెంగాలీ హిందువుల్లోనే బీజేపీ బలాన్ని బాగా పెంచింది. ఆ తర్వాత 2015లో హిమంత బిశ్వ శర్మ పార్టీలో చేరడం.. 2016లో బీజేపీ గెలుపులో, 2021లో అధికారాన్ని నిలబెట్టుకోవడంలో కీలకంగా మారింది. అభివృద్ధి పథకాలు, నియోజకవర్గాల పునర్విభజన, వలస వ్యతిరేక ఉద్యమాలు.. హిందువుల, గిరిజనుల ఓట్లను గంపగుత్తగా బీజేపీకి దక్కేలా చేశాయి.

హిమంత నేతృత్వంలో గెలుపు గాలి

అస్సాంలో బీజేపీ ఆధిక్యం పెరగడంలో హిమంత బిశ్వ శర్మ కీలక వ్యక్తిగా నిలిచారు. ఒకప్పుడు కాంగ్రెస్‌లో కీలకంగా ఉన్న ఆయన.. తర్వాత బీజేపీ ముఖ్య వ్యూహకర్తగా మారి ముఖ్యమంత్రి అయ్యారు. సుదీర్ఘకాలం కాంగ్రెస్‌లో కొనసాగిన హిమంత కు మంత్రిగా పనిచేసిన అనుభవం, కార్యకర్తల మద్దతు భారీగా ఉంది. దీంతో 2015లో ఆయన బీజేపీలోకి రావడం ఆ పార్టీకి బాగా కలిసొచ్చింది. ఆయన మార్గదర్శంలో అమలు చేసిన ప్రచార వ్యూహంతో తొలిసారిగా 2016 ఎన్నికల్లో బీజేపీ 60 సీట్లు గెలుపొందింది. ఏజీపీ వంటి ప్రాంతీయ పార్టీలతో సమన్వయంలోనూ కో-కన్వీనర్‌గా హిమంత చేసిన కృషి ఫలించి ఎన్డీయే 87 స్థానాల్లో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక 2021 ఎన్నికల సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన హిమం త.. పార్టీ అధికారాన్ని నిలబెట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించారు..

Updated Date - May 05 , 2026 | 05:18 AM