హైకోర్టులోనే తేల్చుకోండి
ABN , Publish Date - Oct 30 , 2026 | 04:03 AM
హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) టెండర్ల వివాదాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. టెండర్ల కేటాయింపు ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న..
హెచ్‌జీసీఎల్ టెండర్ల వివాదంపై సుప్రీం కోర్టు
సుశీ ఇన్‌ఫ్రాకు అత్యున్నత న్యాయస్థానంలో నిరాశ
న్యూఢిల్లీ, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) టెండర్ల వివాదాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. టెండర్ల కేటాయింపు ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న ‘సుశీ ఇన్‌ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్’ (కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బంధువుల సంస్థ)కు సుప్రీం కోర్టులో నిరాశ మిగిలింది. హెచ్‌జీసీఎల్ ఆధ్వర్యంలో కొత్వాల్‌గూడ (బుద్వేల్) నుంచి నేషనల్ హైవే 167 ఎన్ (నాచారం, కోస్గి / కొడంగల్) వరకు 81.15 కిలోమీటర్ల మేర రూ.3,296 కోట్లతో రేడియల్ రోడ్డు ప్యాకేజ్ - 2 నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం టెండర్లు పిలిచింది. టెండరు పత్రాల్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇచ్చిన అనుభవ ధ్రువీకరణపై సూపరెంటిండింగ్ ఇంజనీర్ (ఎస్‌ఈ) కౌంటర్ సైన్ చేయలేదంటూ సుశీ ఇన్‌ఫ్రాను సాంకేతికంగా అనర్హురాలిగా ప్రకటించారు. దీనిని సవాల్ చేస్తూ ఆ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. టెండర్ ఫైనల్ చేయకుండా హెచ్‌జీసీఎల్, దాని చీఫ్ జనరల్ మేనేజర్‌కు ఆదేశాలు ఇవ్వాలని కోరింది. అయితే, ప్రజా ప్రయోజనాల కోణంలో టెండరు ప్రక్రియను ఇప్పటికిప్పుడు అడ్డుకోలేమని, ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేసిన తర్వాతే పూర్తి స్థాయిలో పరిశీలిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. దీనిపై సుశీ ఇన్‌ఫ్రా సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
ఈ పిటిషన్ గురువారం సీజేఐ, జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి.మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. ఈ వ్యవహారంపై విచారణ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున, వివాదాన్ని అక్కడే తేల్చుకోవాలని సూచించింది. కొత్తగా కాంట్రాక్టులు దక్కించుకున్న సంస్థలను కూడా ఇందులో ప్రతివాదులుగా చేర్చాలని ఆదేశించింది. రెండు వారాల్లోగా అవి తమ కౌంటర్‌ను అఫిడవిట్ రూపంలో హైకోర్టులో దాఖలు చేయాలని తెలిపింది. ఈ వ్యవహారాన్ని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని హైకోర్టుకు సూచించింది. అప్పటి వరకు కొత్త సంస్థలకు ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి ఈక్విటీ ప్రయోజనాలు కల్పించరాదని స్పష్టం చేసింది.