Share News

Gujarat: మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు..

ABN , Publish Date - Jan 17 , 2026 | 04:33 AM

త్మహత్య చేసుకునేందుకు భార్య ఒంటిపై డీజిల్‌ పోసుకొన్నా ఆ భర్త అడ్డుకోలేదు.. ఆపై ఒంటికి నిప్పంటించుకున్నా ఆమెను కాపాడేందుకు ప్రయత్నించలేదు. పైపెచ్చు..

Gujarat: మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు..

  • భార్య నిప్పంటించుకుంటే దగ్గరుండి వీడియో తీసిన భర్త

  • బాలుడిని ఢీకొన్న చేపల ట్రక్కు.. పిల్లవాడిని చూడకుండా చేపలు ఎత్తుకెళ్లిన జనం

సూరత్‌/ పట్నా, జనవరి 16: ఆత్మహత్య చేసుకునేందుకు భార్య ఒంటిపై డీజిల్‌ పోసుకొన్నా ఆ భర్త అడ్డుకోలేదు.. ఆపై ఒంటికి నిప్పంటించుకున్నా ఆమెను కాపాడేందుకు ప్రయత్నించలేదు. పైపెచ్చు.. ఆమె బలవన్మరణం వెనుక తన పాత్రేమీ లేదనే సాక్ష్యం సిద్ధం చేసేందుకు ఘటననంతా పక్కనే ఉండి సెల్‌ఫోన్‌లో చక్కగా వీడియో తీశాడు! సభ్యసమాజాన్ని దిగ్ర్భాంతికి గురిచేసే ఈ ఘటన గుజరాత్‌లోని సూరత్‌లో జరిగింది. మృతురాలు 31ఏళ్ల ప్రతిమా దేవి. నిందితుడు ఆమె భర్త అయిన 31 ఏళ్ల రంజిత్‌ షా. వీరిది బిహార్‌. రంజిత్‌ వరుసకు సోదరుడయ్యే వ్యక్తికి, ప్రతిమ సోదరికి పెళ్లి జరగడంతో ఇరు కుటుంబాలకు బంధుత్వం ఏర్పడింది. కొన్నాళ్ల రాకపోకల తర్వాత రంజిత్‌-ప్రతిమ మధ్య ఏర్పడిన పరిచయం, ప్రేమకు దారితీసింది. ఇద్దరి పెళ్లికి ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోవడంతో 2013లో ప్రతిమ-రంజిత్‌ సూరత్‌కు పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు. రంజిత్‌ మెకానిక్‌. ప్రతిమ ఇంట్లోనే ఉంటూ పిల్లలను చూసుకునేది. మూడోబిడ్డ పుట్టాక భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. జనవరి 4న పొరుగింటోళ్లు మేడ మీద ఆరబెట్టిన గోధుమలను రంజిత్‌, ప్రతిమ పిల్లలు చిందరవందర చేశారు. పిల్లలను రంజిత్‌ తిట్టిపోశాడు. బయటకు వెళ్లనీయకుండా బంఽధించాడు. తగదని ప్రతిమ వారించినా రంజిత్‌ వినిపించుకోలేదు. ఈ విషయంలో భార్యాభర్తలు గొడవ పడ్డారు.


ఈ క్రమంలో ఇంట్లో తాను క్యాన్‌లో డీజిల్‌ తెచ్చిపెట్టాడని.. ఒంటిమీద పోసుకొని, నిప్పంటించుకొని చచ్చిపో అంటూ భార్యను రంజిత్‌ రెచ్చగొట్టాడు. అతడి మాటలకు తీవ్ర మనస్తాపం చెందిన ప్రతిమ అలానే చేసింది. మంటలతో తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రతిమ 11న మృతిచెందింది. ఆమె ఆత్మహత్య ఘటనలో తన ప్రమేయం లేదని, తనకు తానుగా ఆమె ఒంటిపై డీజిల్‌ పోసుకొని నిప్పంటించుకుందనేందుకు రుజువుగా ఘటననంతా రంజిత్‌ వీడియో తీసినా ఆ వీడియోనే అతడి మెడకు చుట్టుకుంది. పోలీసులు రంజిత్‌ను అదుపులోకి తీసుకొని జైల్లో పెట్టారు. ఇక మానవతావాదుల గుండెలను మెలిపెట్టేసేలా మరో ఘటన బిహార్‌లో జరిగింది. సీతామర్హీ జిల్లాలో ఉదయం శిక్షణా తరగతులకు హాజరయ్యేందుకు రితేశ్‌ కుమార్‌ (13) అనే ఏడో తరగతి విద్యార్థి వెళుతుండగా చేపల లోడ్‌తో వెళుతున్న ట్రక్కు అతడిని ఢీకొట్టి.. రోడ్డుకు అడ్డంగా పల్టీకొట్టింది. ఈ ఘటనలో ఆ బాలుడు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. అయితే క్షణాల్లో గుమిగూడిన జనం, బాలుడు చనిపోయాడన్న కించిత్‌ సానుభూతి కూడా చూపకుండా.. రక్తపు మడుగులో పడ్డ మృతదేహాన్ని పట్టించుకోకుండా ట్రక్కులోని చేపలను ఎత్తుకెళ్లడానికి పోటీపడ్డారు. దొరికినన్ని చేపలను సంచీల్లో వేసుకొని వెళ్లిపోయారు.

Updated Date - Jan 17 , 2026 | 04:33 AM