కేవలం హెచ్‌బీఏ1సీ పరీక్షపైనే ఆధారపడొద్దు!
ABN , Publish Date - Feb 11 , 2026 | 02:02 AM
దక్షిణాసియాలో ప్రత్యేకించి భారతదేశంలో మధుమేహం గుర్తింపు, చికిత్స కోసం కేవలం హెచ్‌బీఏ1సీ(గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్) పరీక్షపైనే ఆధారపడటం తగదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
మధుమేహం గుర్తింపు, చికిత్సపై పరిశోధకుల హెచ్చరిక
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: దక్షిణాసియాలో ప్రత్యేకించి భారతదేశంలో మధుమేహం గుర్తింపు, చికిత్స కోసం కేవలం హెచ్‌బీఏ1సీ(గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్) పరీక్షపైనే ఆధారపడటం తగదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. రక్తహీనత, రక్తం హెచ్చుతగ్గులు ఉన్న సందర్భంలో హెచ్‌బీఏ1సీ పరీక్షపై మాత్రమే ఆధారపడితే వ్యాధి నిర్ధారణ, పర్యవేక్షణ క్లిష్టతరమవుతుందన్నారు. ది లాన్సెంట్ రీజినల్ హెల్త్ సౌత్‌ఈ్‌స్ట ఆసియా జర్నల్‌లో ఈ మేరకు ఒక ఆర్టికల్ ప్రచురితమైంది. కచ్చితమైన నిర్ధారణ కోసం సంబంధిత హెమటాలజిక్ అంచనాలతోపాటు ఓరల్ గ్లూకోజ్ టోలరెన్స్ పరీక్ష, రక్తంలో గ్లూకోజ్ స్థాయిల స్వీయ పర్యవేక్షణ, నిరంతరరంగా గ్లూకోజ్ పర్యవేక్షణ చేపట్టాలని ఆ ఆర్టికల్‌లో సూచించారు. పరిశోధకుల బృందంలో ఫోర్టి్‌స-సీడీఓసీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ డయాబెటిస్, మెటబాలిక్ డిసీజస్ అండ్ ఎండోక్రినాలజీ-న్యూఢిల్లీకి చెందిన నిపుణులు కూడా ఉన్నారు. ప్రత్యేకించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పరిమితస్థాయిలో వనరులున్న కేంద్రాలలో రోగ నిర్ధారణలో కచ్చితత్వం, తగిన చికిత్స కోసం మల్టీపారామెట్రిక్ అప్రోచ్ అవసరమని ఈ బృందం స్పష్టం చేసింది. రక్తంలో గత రెండు-మూడు నెలల సగటు చక్కెర స్థాయిని కొలిచేందుకు హెచ్‌బీఏ1సీ పరీక్ష చేస్తున్నారు.