కామన్‌వెల్త్ క్రీడలకు ఆతిథ్యమిచ్చేందుకు హర్యానాకు ఛాన్స్ ఇవ్వాలి: కాంగ్రెస్ ఎంపీ
ABN , Publish Date - Aug 04 , 2026 | 12:08 PM
కామన్‌వెల్త్ క్రీడలకు ఆతిథ్యమిచ్చే అవకాశాన్ని హర్యానాకు ఇవ్వాలని రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటు కాంప్లెక్స్ ముందు నిరసనకు దిగారు.
ఇంటర్నెట్ డెస్క్: కామన్‌వెల్త్ క్రీడలకు ఆతిథ్యమిచ్చే అవకాశాన్ని హర్యానాకు ఇవ్వాలని రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటు కాంప్లెక్స్ ముందు నిరసనకు దిగారు. ఇతర రాష్ట్రాలతో కలిసి సంయుక్తంగా ఆతిథ్యమిచ్చే అవకాశాన్ని అయినా ఇవ్వాలని కోరారు. భారత క్రీడావిజయాల్లో హర్యానా పాత్ర ఎంతో గొప్పదని అన్నారు. కాబట్టి, 2030లో జరగనున్న కామన్‌వెల్త్ క్రీడలకు ఆతిథ్యమిచ్చే అవకాశం తమకు దక్కాలని చెప్పారు.
ఈ నిరసనల్లో కాంగ్రెస్ ఎంపీ దీపీందర్ సింగ్ హుడాతో పాటు ఎంపీలు జైప్రకాశ్, వరుణ్ ముల్లానా, సత్‌పాల్ బ్రహ్మచారి, కర్మవీర్ బౌద్ధ కూడా పాల్గొన్నారు. హర్యానా మెడల్స్ తెస్తుంటే గుజరాత్‌లో క్రీడలు నిర్వహించడమేమిటని వారు ప్రశ్నించారు. క్రీడల వేదికపై కేంద్రం మరోసారి పునరాలోచించాలని కోరారు. హర్యానా హక్కులు సాధించుకునేందుకు తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు. హర్యానా జనాభా తక్కువైనప్పటికీ అంతర్జాతీయ క్రీడా ఈవెంట్స్‌లో అత్యధిక మెడల్స్ సాధిస్తున్న రాష్ట్రంగా నిలుస్తోందని అన్నారు. క్రీడారంగంలో యావత్ దేశంలో హర్యానా ముందుందని గుర్తు చేశారు. 2030 కామన్‌వెల్త్ క్రీడలకు ఆతిథ్యమిచ్చే అవకాశం కోసం భారత్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు కావాల్సిన మౌలిక వసతులు హర్యానాలో ఉన్నాయని రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు చెబుతున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
సీఎం, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు.. ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్..
రాజకీయాలకు దూరంగా ఉంటాను: ప్రశాంత్ కిషోర్ భార్య