Share News

సుప్రీంకోర్టుకు ప్రతిపక్షాల మార్చ్‌ ‘మూర్ఖత్వం’!

ABN , Publish Date - Oct 13 , 2026 | 06:50 AM

ప్రతిపక్ష పార్టీలు సుప్రీంకోర్టుకు చేపట్టిన ఆందోళన మార్చ్‌ను ‘అత్యంత మూర్ఖత్వం’గా సీనియర్‌ న్యాయవాది, భారత మాజీ సొలిసిటర్‌ జనరల్‌ హరీశ్‌ సాల్వే అభివర్ణించారు.

సుప్రీంకోర్టుకు ప్రతిపక్షాల మార్చ్‌ ‘మూర్ఖత్వం’!

  • భారత్‌లో ఆందోళనల వెనుక విదేశీ

  • శక్తులు, ఫండింగ్‌: హరీశ్‌ సాల్వే

న్యూఢిల్లీ, అక్టోబరు 12: ప్రతిపక్ష పార్టీలు సుప్రీంకోర్టుకు చేపట్టిన ఆందోళన మార్చ్‌ను ‘అత్యంత మూర్ఖత్వం’గా సీనియర్‌ న్యాయవాది, భారత మాజీ సొలిసిటర్‌ జనరల్‌ హరీశ్‌ సాల్వే అభివర్ణించారు. సర్వోన్నత న్యాయస్థానాన్ని ఒక రాజకీయ సాధనంగా వాడుకుంటున్నారని ఆరోపించారు. ఓ వార్తతో సంస్థతో ఆయన మాట్లాడుతూ.. సీజేఐని కలిసేందుకు ప్రతిపక్షాలు చేసిన ప్రయత్నాలను తీవ్రంగా విమర్శించారు. అలాగే న్యాయవ్యవస్థను ఆశ్రయించడం, జ్ఞానేశ్‌ కుమార్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలను కూడా ప్రశ్నించారు. ఓటు చోరీకి వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనల్లో భాగంగా ప్రతిపక్షాలు సుప్రీంకోర్టుకు మార్చ్‌ చేపట్టే ముందు హరీశ్‌ సాల్వే ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో భారత్‌లో కొన్ని ఆందోళనల వెనుక విదేశీ శక్తులు, నిధుల పాత్ర ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఆందోళనలు నిర్వహించేందుకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు. వ్యవస్థను అస్థిరపరచడానికి, భారతదేశం పురోగతి సాధించకుండా అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ప్రధానంగా అమెరికా వంటి కొన్ని దేశాలు భారత్‌ పట్ల అసంతృప్తిగా ఉన్నాయని ఆరోపించిన మాజీ ఎస్‌జీ.. మన పొరుగు దేశాలైన నేపాల్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌లలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు బాహ్య (విదేశీ శక్తుల) జోక్యం సరళిని సూచిస్తున్నాయని అభిప్రాయపడ్డారు.

Updated Date - Oct 13 , 2026 | 06:50 AM