‘నిద్ర పో బిడ్డా..’
ABN , Publish Date - Mar 17 , 2026 | 06:57 AM
‘నిద్ర పో బిడ్డా..’ అంటూ ధార్మిక పలుకులు! నుదిటిపై అరచెయ్యి ఉంచి ‘అంతా సరిగానే ఉంది..’ అన్నట్టు మౌన భరోసా! యూపీలోని గజియాబాద్‌కు చెందిన యువకుడు హరీశ్‌రాణాకు తల్లిదండ్రులు చివరి వీడ్కోలు పలికేందుకు సిద్ధమవుతున్న తీరు ఇది.
కుమారుడు హరీశ్ రాణాకు చివరి వీడ్కోలు
అందించేందుకు సిద్ధమైన తల్లిదండ్రులు
గజియాబాద్, మార్చి 16 : ‘నిద్ర పో బిడ్డా..’ అంటూ ధార్మిక పలుకులు! నుదిటిపై అరచెయ్యి ఉంచి ‘అంతా సరిగానే ఉంది..’ అన్నట్టు మౌన భరోసా! యూపీలోని గజియాబాద్‌కు చెందిన యువకుడు హరీశ్‌రాణాకు తల్లిదండ్రులు చివరి వీడ్కోలు పలికేందుకు సిద్ధమవుతున్న తీరు ఇది. దీనిపై విడుదలయిన వీడియో ప్రతి ఒక్కరితో కంట తడి పెట్టిస్తోంది. సుప్రీంకోర్టు కారుణ్య మరణ ప్రక్రియకు అంగీకరించడంతో హరీశ్‌రాణాను ఆయన తల్లిదండ్రులు గజియాబాద్ నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా రాణా నివాసంలో నిర్వహించిన ధార్మిక కార్యక్రమం వీడియో సోషల్ మీడియాలో పోస్టు అయింది. హరీశ్ రాణాకు మరణానంతరం ప్రశాంతత, సంతోషం ప్రాప్తించాలని కోరుతూ బ్రహ్మకుమారి సిస్టర్ లౌలీ ధార్మిక క్రతువును నిర్వహించడం ఆ వీడియోలో కనిపించింది. 13 ఏళ్ల క్రితం ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లిన హరీశ్‌రాణాకు కారుణ్య మరణం కల్పించాలని అతని తండ్రి అశోక్ రాణా నాలుగేళ్లు న్యాయపోరాటం సాగించారు. చివరికి దేశంలోనే తొలిసారి కారుణ్య మరణానికి కోర్టు అనుమతి పొందారు. ఇప్పటివరకు ఇంట్లోనే ఉంచి హరీశ్‌రాణాకు తల్లిదండ్రులు లైఫ్ సపోర్టు చికిత్స అందిస్తున్నారు. కోర్టు ఆదేశాలతో ఇప్పుడు హరీశ్‌రాణాను ఎయిమ్స్‌కు తరలించాల్సి ఉంది. అయితే, అక్కడ హరీశ్‌కు లైఫ్ సపోర్ట్‌ను తొలగించే ప్రక్రియను ఎప్పుడు పూర్తి చేస్తారనేదానిపైన మాత్రం స్పష్టత లేదు.