హడలెత్తిస్తున్న హంటా!
ABN , Publish Date - May 09 , 2026 | 06:42 AM
కరోనా మహమ్మారితో కలవరపడ్డ ప్రపంచాన్ని ఇప్పుడు హంటా వైరస్ హడలెత్తిస్తోంది. ఈ వైరస్ బారినపడి భార్యాభర్తలు సహా ముగ్గురు మృత్యువాత పడ్డారు. మరో ఐదుగురిలో వ్యాధిని గుర్తించారు. ఎలుకల...
వైరస్ బారినపడి ముగ్గురు మృతి
మరో ఐదుగురిలో వ్యాధి గుర్తింపు
డచ్‌కు చెందిన విలాస నౌకలో వైరస్ కేంద్రం
నౌకా సిబ్బందిలో ఇద్దరు భారతీయులు కూడా భారత్‌కు ముప్పేమీ లేదు : కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ, మే 8: కరోనా మహమ్మారితో కలవరపడ్డ ప్రపంచాన్ని ఇప్పుడు హంటా వైరస్ హడలెత్తిస్తోంది. ఈ వైరస్ బారినపడి భార్యాభర్తలు సహా ముగ్గురు మృత్యువాత పడ్డారు. మరో ఐదుగురిలో వ్యాధిని గుర్తించారు. ఎలుకల విసర్జితాల ద్వారా హంటా విస్తరిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అట్లాంటిక్ సముద్రంలో ప్రయాణిస్తున్న క్రూజ్ నౌక ఎంవీ హౌండియ్‌సలో ఈ నెల రెండో తేదీన హంటా బయటపడింది. తీవ్ర అనారోగ్యానికి గురైన వ్యక్తికి పరీక్షలు జరపగా, తొలిసారి వైరస్ విషయం బయటపడింది. అప్పటికే ముగ్గురు రోజుల తేడాతో మరణించారు. వారిలో ఇద్దరు నౌకలోనే మరణించారు. దీంతో ఈ నౌకే హంటా వైరస్ కేంద్రమని గుర్తించారు. నౌకా సిబ్బందిలో ఇద్దరు భారతీయులు కూడా ఉండటం మరింత కలవరపెడుతోంది. డచ్‌కు చెందిన ఎంవీ హౌండియస్ గత నెల ఒకటో తేదీన అర్జెంటీనాలోని ఉషుయా నుంచి స్పెయిన్‌లోని క్యానరీ దీవులకు బయల్దేరింది. ఈ నౌకలో 28 దేశాలకు చెందిన 150 మంది పర్యాటకులు ఉన్నారని తెలుస్తోంది. హంటా వైర్‌సకు గురైన ఎలుకల విసర్జితాలను తీసివేసే క్రమంలో అది వ్యాపించినట్టు డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ‘‘వైరస్ సోకిన తర్వాత లక్షణాలు ఆరు వారాలలోపు బయటపడే అవకాశం ఉంది. అందువల్ల హంటా వైరస్ బాధితుల సంఖ్య మరింత పెరగవచ్చు’’ అని వెల్లడించింది. మనిషి నుంచి మనిషికి వ్యాపించే అంటువ్యాధి లక్షణం ఈ వైర్‌సకు లేదని తెలిపింది. అర్జెంటీనా దక్షిణ ప్రాంతంలోని ఉషుయా ఓడరేవులో డచ్ వ్యక్తి(70) తన భార్యతో కలిసి ఎంవీ హౌండియస్ నౌక ఎక్కారు. ఆ తర్వాత ఐదు రోజులకు ఆయన తీవ్ర జ్వరం, తలనొప్పి, స్వల్పంగా డయేరియాతో బాధపడుతూ, గత నెల ఏప్రిల్ ఆరోతేదీన మరణించాడు. భర్త చనిపోయిన 20 రోజులకు భార్య కూడా చనిపోయింది. మూడో హంటా మృతురాలిని జర్మనీ పర్యాటకురాలిగా గుర్తించారు. కాగా, హంటా వల్ల తక్షణంగా భారత్‌కు వచ్చిన ఆముప్పేమీ లేదని వైరాలజీ జాతీయ సంస్థ డైరెక్టర్ నవీన్ కుమార్ తెలిపారు. మరోవైపు కరోనా మహమ్మారితో హంటాను పోల్చలేమని డబ్ల్యూహెచ్‌వోకు చెందిన అంటువ్యాధుల నిపుణురాలు మరియా వాన్ కెర్కోవా అన్నారు.