‘ఆమ్కా’ రేసు నుంచి హాల్ ఔట్!
ABN , Publish Date - Feb 05 , 2026 | 04:03 AM
భారత్ ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేయతలపెట్టిన ఐదోతరం స్టెల్త్ యుద్ధ విమానం ‘ఆమ్కా (అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్)’ ప్రాజెక్టు హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ....
తప్పనిసరి అర్హతా ప్రమాణాలను హాల్ అందుకోలేకపోయిందన్న అధికారవర్గాలు
రెండో దశ కోసం 3 సంస్థల ఎంపిక
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: భారత్ ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేయతలపెట్టిన ఐదోతరం స్టెల్త్ యుద్ధ విమానం ‘ఆమ్కా (అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్)’ ప్రాజెక్టు హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) చేజారింది. ఈ ప్రాజెక్టు కోసం వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు కలిపి వేర్వేరుగా ఏడు కన్సార్షియాలుగా బిడ్లు దాఖలు చేశాయి. అయితే ప్రాజెక్టు కోసం నిర్ణయించిన తప్పనిసరి అర్హతా ప్రమాణాలను అందుకోవడంలో హాల్‌తోపాటు మరో మూడు సంస్థలు విఫలమయ్యాయని.. మిగతా మూడు సంస్థలు తదుపరి పరిశీలన దశ (కాస్ట్ బిడ్స్)కు ఎంపిక అయ్యాయని అధికార వర్గాలు తెలిపాయి. అయితే ఆ సంస్థలు ఏవనేది వెల్లడించలేదు. రక్షణ శాఖ పరిధిలోని ఏరోనాటికల్ డెవల్‌పమెంట్ ఏజెన్సీ (ఏడీఏ) గత ఏడాది ‘ఆమ్కా’ ప్రాజెక్టు కోసం బిడ్లను ఆదేశించింది. దానిలో రెండు చిన్న సంస్థలతో కలిసి హాల్ బిడ్ వేసింది. దీనితోపాటు టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్, అదానీ డిఫెన్స్ అండ్ ఎయిర్‌ఫోర్స్, ఎల్‌అండ్‌టీ- బీఈఎల్ కన్సార్షియం, గుడ్‌లక్ ఇండియా-బ్రహ్మోస్ ఏరోస్పేస్ తిరువనంతపురం లిమిటెడ్, యాక్సిస్కేడ్స్ టెక్నాలజీస్ కన్సార్షియం, భారత్ ఫోర్జ్ లిమిటెడ్-బీఈఎంఎల్-డేటా ప్యాటర్న్స్ కన్సార్షియం బిడ్లు వేశాయి. మూడు నెలల్లో సంస్థను ఎంపిక చేసి.. ఆమ్కా ప్రాజెక్టును అప్పగించనున్నారు. ఎంపికైన సంస్థ ఐదు ఆమ్కా ఫైటర్ల ప్రొటోటై్‌పలను, నిర్మాణ ఆకృతిని పరీక్షించే ఒక నమూనాను రూపొందించాల్సి ఉంటుంది.