Share News

జ్ఞానేశ్‌.. దిగిపో!

ABN , Publish Date - Oct 03 , 2026 | 03:26 AM

ఎస్‌ఐఆర్‌, ఓటరు జాబితాల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ ప్రతిపక్షాలు శుక్రవారం భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి.

జ్ఞానేశ్‌..  దిగిపో!

  • సీఈసీకి వ్యతిరేకంగా ముంబైలో సీజేపీ నిరసన.. ఢిల్లీలో ఇండీ కూటమి ధర్నా

  • సీజేపీ ఆందోళనకు వేలాదిగా తరలివచ్చిన జెన్‌జీ

  • సీఎం ఫడణవీస్‌.. దమ్ముంటే మమ్మల్ని అరెస్టు చేయించు

  • మహారాష్ట్ర సీఎంకు సీజేపీ కన్వీనర్‌ అభిజీత్‌ దీప్కే సవాల్‌

  • సీఈసీ వైదొలగకుంటే చలో ఢిల్లీ నిర్వహిస్తామని హెచ్చరిక

  • ఢిల్లీ జంతర్‌మంతర్‌ వద్ద ఇండీ కూటమి నిరసనలను

  • ఎక్కడికక్కడ అడ్డుకున్న పోలీసులు.. 1100 మంది అరెస్ట్‌

న్యూఢిల్లీ /ముంబై, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): ఎస్‌ఐఆర్‌, ఓటరు జాబితాల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ ప్రతిపక్షాలు శుక్రవారం భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ఇండియా కూటమి ధర్నా నిర్వహించగా, ముంబైలోని శివాజీ పార్కులో కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) భారీ నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఈ కార్యక్రమాలను అడ్డుకొనేందుకు రెండు నగరాల్లో భారీగా పోలీసులను మోహరించారు. ఇంటర్నెట్‌ సేవలను నిలిపేశారు. ముంబైలో సీజేపీ ఆధ్వర్యంలో వేలమంది యువతతో నిరసన ప్రదర్శన జరిగింది. ఈ పార్కుకు వెళ్లే దారులను పోలీసులు మూసివేసినప్పటికీ నిరసనకారులను అడ్డుకోలేకపోయారు. ‘జ్ఞానేశ్‌కుమార్‌ పదవి నుంచి దిగిపో’.. అనే నినాదాలు రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శిస్తూ, ‘సేవ్‌ డెమోక్రసీ’ నినాదాలతో కదం తొక్కారు. సీజేపీ ధర్నాకు పలువురు సెలబ్రెటీలు మద్దతు ప్రకటించారు. సినీనటులు షబానా ఆజ్మీ, నసీరుద్దీన్‌ షా, సంగీతకారుడు విశాల్‌ దద్లానీ, మహాత్మాగాంధీ ముని మనవడు తుషార్‌గాంధీ తదితరులు ధర్నాలో పాల్గొన్నారు. పోలీసులు ఇంటర్నెట్‌ను నిలిపేయటంతో తమ ధర్నాను ప్రత్యక్ష ప్రసారం చేయలేకపోయామని సీజేపీ తెలిపింది. దీప్కేకు వ్యతిరేకంగా ముంబైలోని సచివాలయం ముందు జెన్‌నెక్స్ట్‌ పేరుతో కొందరు ధర్నా చేశారు. శివాజీ పార్కులో ధర్నాతో తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ ఆ ప్రాంతంలో నివసించేవారు నిరసన తెలిపారు.

Untitled-3 copy.jpg


సీఈసీ రాజీనామా చేయకుంటే జంతర్‌మంతర్‌ 2.0: దీప్కే

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ వెంటనే రాజీనామా చేయకుంటే ఢిల్లీలో జంతర్‌మంతర్‌ 2.0 నిర్వహిస్తామని సీజేపీ కన్వీనర్‌ అభిజీత్‌ దీప్కే హెచ్చరించారు. శివాజీ పార్కులో కిక్కిరిసిన నిరసనకారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ దేశ ప్రజలకు ఎన్నికల వ్యవస్థపై నమ్మకం పోయేలా చేశారన్నారు. ఆయన తన పదవికి రాజీనామా చేసేవరకు ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టంచేశారు. నిరసనకారులపై పోలీసులు నిర్బంధం విధించటంపై దీప్కే ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘సీఎం ఫడ్నవీస్‌.. చేతనైతే మమ్మల్ని అరెస్టు చేయండి. ఎంతమందిని అరెస్టు చేయిస్తారో చేయించండి’ అని సవాలు విసిరారు. చలో ఢిల్లీ మార్చ్‌కు పిలుపునిచ్చారు. ‘ఎస్‌ఐఆర్‌ అక్రమాలపై మా మొదటి నిరసన మహారాష్ట్రలోనే నిర్వహించటానికి కారణం ఉంది. ఎస్‌ఐఆర్‌ అక్రమాలు ఈ రాష్ట్రం నుంచే మొదలయ్యాయి. అందుకే మేము ఇక్కడి నుంచి మొదలుపెట్టాం’’ అని దీప్కే అన్నారు. ‘‘ప్రధాని మోదీ ప్రభావం అధికంగా ఉన్న సమయంలో కూడా గెలవలేకపోయిన రాష్ట్రాల్లో ఎస్‌ఐఆర్‌ తర్వాత బీజేపీ గెలిచింది. రెండేళ్లలో 13కోట్ల మంది ఓట్లను తొలగించారు. మహారాష్ట్రలో 2024 ఎన్నికలకు ముందు 40లక్షల ఓట్లను కొత్తగా చేర్చి బీజేపీ అసెంబ్లీ ఎన్నికలను దోపిడీ చేసింది’’ అని ఆరోపించారు. ఢిల్లీలో కేజ్రీవాల్‌, తమిళనాడులో స్టాలిన్‌, బెంగాల్‌లో మమత పోటీచేసిన చోట స్థానాల్లో భారీగా ఓట్లను తొలగించడం వల్లే ఆయా స్థానాల్లో వాళ్లు ఓడిపోయారు అని అన్నారు. ‘‘తెలంగాణ, కర్ణాటక, ఝార్ఖండ్‌లలో ప్రతిపక్షాలు గెలిచాయి కదా? అని బీజేపీ మద్దతుదారులు ప్రశ్నిస్తున్నారు. కానీ, మ్యాచ్‌ ఫిక్సింగ్‌ జరిగినప్పుడు అన్ని బంతులను నో బాల్స్‌గా వేయరు.. అన్ని క్యాచులను వదిలేయరు’’ అని దీప్కే పేర్కొన్నారు.


రణరంగమైన మధ్య ఢిల్లీ..

ఢిల్లీలోని జంతర్‌మంతర్‌కు నిరసనకారులు ఎవరూ రాకుండా ఆ ప్రాంతాన్ని పోలీసులు ముందుగానే మూసివేశారు. సమీపంలోని 11 మెట్రో స్టేషన్లను కూడా తాత్కాలికంగా మూసివేశారు. ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టి, వందలమంది పోలీసులు నిరసనకారులకు అడ్డుగోడగా నిలబడ్డారు. పోలీసుల నిర్బంధాన్ని లెక్క చేయకుండా ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్‌), వామపక్షాలు, కాంగ్రెస్‌, ఆర్జేడీ పార్టీల నేతలు, కార్యకర్తలు గుంపులు గుంపులుగా జంతర్‌మంతర్‌కు చేరుకున్నారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జీ చేశారు. వందల మందిని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ మాజీ సీఎం ఆతిశీ, ఆప్‌ నేతలు సంజయ్‌సింగ్‌, సౌర భ్‌ భరద్వాజ్‌, సీపీఎం నేతలు ఎంఏ బేబీ, బృందా కరాత్‌, సీపీఐ ఎంపీ సంతోష్ కుమార్‌, ఆర్జేడీ ఎంపీ మనోజ్‌ ఝా తదితరులతోపాటు మొత్తం 1,100 మందిని అరెస్టు చేశారు. దీంతో సెంట్రల్‌ ఢిల్లీ యుద్ధరంగాన్ని తలపించింది. ప్రధాని మోదీని వ్యతిరేకించేవారిని పోలీసులు అణచివేస్తున్నారని ఆతిశీ ఆరోపించారు. సీఈసీ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. జ్ఞానేశ్‌కుమార్‌ ప్రజాస్వామ్య ఘాతకుడని ఎంఏ బేబీ అన్నారు. విద్యార్థుల అరెస్టును కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ ఖండించారు. ‘యువతీ యువకులను పోలీసులు రోడ్డుపై ఈడ్చుకెళ్తున్నారు. వారు చేసిన నేరమళ్లా.. ఓట్ల తస్కరణను ప్రశ్నిచటమే’ అని ఎక్స్‌ వేదికగా మండిపడ్డారు. కాగా, ఎస్‌ఐఆర్‌ అవకతవకలపై పోరాటాన్ని మరింత ఉధృతం చేసేందుకు ఈ నెల 5న కాంగ్రెస్‌ పార్టీ ఏఐసీసీ ఇన్‌చార్జిలు, రాష్ట్రాల పార్టీ అధ్యక్షులతో సమావేశం నిర్వహిస్తోంది.

Updated Date - Oct 03 , 2026 | 03:30 AM