Share News

జ్ఞానేశ్‌పై ప్రజా అభిశంసన

ABN , Publish Date - Nov 01 , 2026 | 02:31 AM

కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) పక్షపాత వైఖరితో వ్యవహరిస్తోందంటూ ప్రతిపక్ష ‘ఇండి’ కూటమి వినూత్న నిరసనకు దిగింది. శనివారం ఢిల్లీలో..

జ్ఞానేశ్‌పై ప్రజా అభిశంసన

  • విపక్షాల వినూత్న నిరసన.. ఇండీ కూటమి మాక్‌ పార్లమెంట్‌

  • జ్ఞానేశ్‌ను వెంటనే తొలగించాలని తీర్మానం.. 6 అభియోగాలు

  • ఓటర్ల జాబితాలపై కేంద్రీకృత నియంత్రణ.. ‘సర్‌’లో అక్రమాలు

  • గత ఎన్నికలు చట్టవిరుద్ధం.. వాళ్లు అక్రమంగా ఎన్నికయ్యారు

  • మోదీని మేం చూసుకుంటాం.. అధికారులు పావుగా మారొద్దు

  • గెలిచినవాళ్లకు ఓడిన వారికి ఓట్ల శాతంలో తేడా 3 శాతమే..

  • ఆదివారం ఢిల్లీ వీధులను హోరెత్తిస్తాం: రాహుల్‌ గాంధీ

  • రాహుల్‌ను ‘మాక్‌ ప్రధాని’ చేసుకోండి.. బీజేపీ ఎద్దేవా

  • సీఈసీపై ఆరు ప్రధాన అభియోగాలు..

న్యూఢిల్లీ, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) పక్షపాత వైఖరితో వ్యవహరిస్తోందంటూ ప్రతిపక్ష ‘ఇండి’ కూటమి వినూత్న నిరసనకు దిగింది. శనివారం ఢిల్లీలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే అధికారిక నివాసంలో లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరాకుమార్‌ అధ్యక్షతన ‘మాక్‌ పార్లమెంట్‌’ నిర్వహించింది. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ‘బహిరంగ ప్రజా అభిశంసన’(ఇంపీచ్‌మెంట్‌) తీర్మానం ప్రవేశపెట్టింది. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌) ప్రక్రియలో తీవ్ర అవకతవకలు జరిగాయని ఆరోపించింది. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా ఆదేశాలకు అనుగుణంగా జ్ఞానేశ్‌కుమార్‌ ఎన్నికల కమిషన్‌ను నడుపుతున్నారని ఖర్గే విమర్శించారు. దేశంలో సామాన్యుడి ఓటు హక్కు ప్రమాదంలో పడిందని ఆరోపించారు. ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన 2023 చట్టాన్ని రద్దు చేయాలని, ‘సర్‌’ ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతోపాటు సాధారణ పౌరులు కూడా పాల్గొన్నారు. దేశంలోని 60 శాతం ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు ఈ మాక్‌ పార్లమెంటుకు హాజరైనట్లు కాంగ్రెస్‌ వెల్లడించింది. కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీతోపాటు సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. మాక్‌ పార్లమెంటులో జ్ఞానేశ్‌పై ఆరోపణలను ఖర్గే చదివి వినిపించారు.


‘ఇండి’ కూటమి అభియోగాలు

1) లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను తారుమారు చేసేందుకు(దొంగిలించేందుకు) బీజేపీ పన్నిన దుర్మార్గపు నేరపూరిత కుట్రలో జ్ఞానేశ్‌కుమార్‌ భాగస్వామిగా మారారు. ఓటర్ల జాబితాలను యాక్సెస్‌ చేసేందుకు, నచ్చినట్లుగా ఓటర్లను తొలగించడానికి, కొత్తగా చేర్చడానికి బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ చట్టాన్ని ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారు. ఎన్నికల వ్యవస్థపై కుట్రతో జరిగిన దాడికి ఆయనే బాధ్యుడు. ఇది పక్కా నేరపూరిత చర్య.

2) ఓటర్ల జాబితాల సవరణ పేరుతో చేపట్టిన ‘సర్‌’ ప్రక్రియను దుర్మార్గంగా, అసంపూర్తిగా నిర్వహించినందుకు సీఈసీ జ్ఞానేశ్‌ కుమారే ప్రత్యక్ష బాధ్యుడు. పక్షపాతంతో, సహజ న్యాయసూత్రాలను కాలరాస్తూ ఏకంగా 13.2 కోట్ల మంది ఓటర్ల పేర్లను ఉద్దేశపూర్వకంగా తొలగించారు. తద్వారా రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక ఓటు హక్కును వారికి దూరం చేశారు.

3) పార్లమెంటుకు తెలియకుండా, ఎలాంటి అనుమతి లేకుండా 1960 నాటి ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ నిబంధనల్లోని ఫారం-6ను సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ అక్రమంగా సవరించారు. కొత్తగా ఓటు హక్కు పొందే ఓటర్లు (యువత) నమోదు కాకుండా అడ్డుకునేందుకు కుట్రపన్నారు. పౌరులుగా వారి ప్రాథమిక హక్కులను అణచివేశారు. ఈ మూడూ దేశానికి, రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేసిన ద్రోహాలే.

4) ఈఆర్వోనెట్‌/ఈసీఐనెట్‌ సాఫ్ట్‌వేర్‌ను దుర్వినియోగం చేస్తూ.. ఓటర్ల జాబితాలపై జ్ఞానేశ్‌ అక్రమంగా కేంద్రీకృత నియంత్రణ సాధించారు. స్థానిక ఎన్నికల రిజిస్ట్రేషన్‌ అధికారులు(ఈఆర్‌ఓలు) అర్హులైన ఓటర్లను చేర్చకుండా నిరోధించడం, ఉన్న ఓటర్లను తొలగించడమే దీని వెనుక ఉన్న అసలు కుట్ర.


5) ఎన్నికల సంఘంలోని ఇద్దరు తోటి కమిషనర్లను నిర్ణయాత్మక ప్రక్రియ నుంచి ఉద్దేశపూర్వకంగా పక్కనబెట్టి సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ చట్టాన్ని ఉల్లంఘించారు. మిగతా ఏడుగురు అధికారులతో కలిసి ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారు. దీనిపై ఎన్నికల కమిషనర్లు 14 అభ్యంతరాలను నమోదు చేశారు.

6) స్వతంత్రంగా వ్యవహరిస్తూ, స్వేచ్ఛాయుతంగా ఎన్నికలను నిర్వహించాల్సిన రాజ్యాంగ బాధ్యతను సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ విస్మరించారు. వినతిపత్రాలు ఇచ్చేందుకు వచ్చిన ప్రతిపక్ష నాయకుల ముందే ఈసీఐ తలుపులు మూసేశారు. కేంద్రంలో ఉన్న బీజేపీకి ఊడిగం చేసినందుకు ప్రతిఫలంగా జ్ఞానేశ్‌ కుటుంబసభ్యులకు పదవులు, ఆర్థిక లబ్ధి చేకూరేలా నజరానాలు ఇచ్చారు. మోదీ, అమిత్‌ షాల ఆదేశాలకు లొంగిపోయి రాజ్యాంగ వ్యవస్థల విశ్వసనీయతను జ్ఞానేశ్‌ దెబ్బతీశారు.

రాహుల్‌ను ‘మాక్‌ ప్రధాని’ చేసుకోండి: బీజేపీ

ఇండి కూటమి మాక్‌ పార్లమెంటును బీజేపీ ఎగతాళి చేసింది. ఎన్నికల్లో బీజేపీని ఓడించలేకపోతున్న కాంగ్రెస్‌ నిరసనల ద్వారా ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌పాత్రా విమర్శించారు. ‘‘రాహుల్‌ గాంధీని మాక్‌ ప్రధానిని చేసుకుని, ఆయనకు కుర్తా-పైజామా వేసి.. రోజూ ప్రధాని, ప్రధాని అంటూ భజనలు చేసుకోండి’’ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌, రాహుల్‌ గాంధీ లక్ష్యం కేవలం ప్రభుత్వాన్ని కూల్చడమేనని ఆరోపించారు.


మరో దారి లేకనే ‘ప్రజా అభిశంసన’: రాహుల్‌ గాంధీ

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ ఇక ఆ పదవిలో కొనసాగలేరని.. ఆయన్ను తప్పించేందుకు తమ వద్ద తగినంత సమాచారం, ఆధారాలు ఉన్నాయని రాహుల్‌ గాంధీ చెప్పారు. మాక్‌ పార్లమెంటులో ఆయన మాట్లాడారు. ‘‘ప్రతిపక్షాలన్నీ కలిసి ఖర్గే నివాసంలోని ఒక తోటలో కూర్చొని సీఈసీ అభిశంసనపై చర్చించాల్సి వస్తోందంటే దేశంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రతిపక్షాల వద్ద వేరే మార్గం లేకనే ఈ ప్రజా అభిశంసన కార్యక్రమాన్ని ఒక రాజ్యాంగబద్ధ, రాజకీయ ఆయుధంగా మలచుకున్నాం’’ అని స్పష్టం చేశారు. సీఈసీకి రాజ్యాంగ రక్షణ ఉన్నంత మాత్రాన జవాబుదారీతనం నుంచి తప్పించుకోలేరని పేర్కొన్నారు. ‘‘మోదీ, అమిత్‌ షా, జ్ఞానేశ్‌ కలిసి ఈ ఆటను చివరికి ఎన్నికల రిగ్గింగ్‌ స్థాయికి తీసుకువెళ్లారు. మోదీ, షా అగ్రస్థానంలో ఉండవచ్చు... వారి సంగతి మేం చూసుకుంటాం. కానీ మీరు మాత్రం వారి చేతుల్లో పావులుగా మారుతున్నారు. దేశ యువత మిమ్మల్ని ఎంతమాత్రం క్షమించదు’’ అని అధికారులకు రాహుల్‌ స్పష్టం చేశారు. దేశంలోని మొత్తం ఓటర్లలో దాదాపు 15 శాతానికి సమానమైన 13.3 కోట్ల మంది పేర్లను తొలగించారని పేర్కొన్నారు. ఈ స్థాయిలో ఓటర్లను తొలగించడం ఎన్నికల చెల్లుబాటునే ప్రశ్నార్థకం చేస్తోందన్నారు. గెలిచిన అభ్యర్థులకు, ప్రతిపక్ష అభ్యర్థులకు మధ్య ఓట్ల వ్యత్యాసం సగటున 3 శాతమే ఉందని చెప్పారు.

Updated Date - Nov 01 , 2026 | 02:35 AM