Share News

భక్తులపైకి దూసుకెళ్లిన లారీ.. 15 మంది దుర్మరణం

ABN , Publish Date - Oct 19 , 2026 | 06:02 AM

నవరాత్రుల సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం వెళ్తున్న భక్తుల పాలిట ఓ లారీ మృత్యు శకటమైంది. ఆలయానికి వెళ్తున్న భక్తులపైకి దూసుకెళ్లడంతో 15 మంది దుర్మరణం చెందారు.

భక్తులపైకి దూసుకెళ్లిన లారీ.. 15 మంది దుర్మరణం

  • మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఘోర ప్రమాదం

  • నవరాత్రుల వేళ శీతలామాత ఆలయం వద్ద విషాదం

  • 28 మందికి తీవ్ర గాయాలు.. విచారణకు ఆదేశించిన సీఎం

  • పోలీసు ఉన్నతాధికారిపై వేటు.. మరో 8 మంది సస్పెన్షన్‌

  • మృతుల కుటుంబాలకు 4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా

గ్వాలియర్‌/భోపాల్‌, అక్టోబరు 18: నవరాత్రుల సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం వెళ్తున్న భక్తుల పాలిట ఓ లారీ మృత్యు శకటమైంది. ఆలయానికి వెళ్తున్న భక్తులపైకి దూసుకెళ్లడంతో 15 మంది దుర్మరణం చెందారు. ఇద్దరు పోలీసులు సహా 28 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘోర ప్రమాదం మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ జిల్లాలో శీతలామాత ఆలయం వద్ద చోటుచేసుకుంది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ప్రమాదం జరిగింది.


నో ఎంట్రీలోకి లారీ ఎలా వచ్చింది?

గ్వాలియర్‌ నగరానికి 20 కి.మీ. దూరంలో శీతలామాత ఆలయం ఉంది. నవరాత్రుల సందర్భంగా ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ క్రమంలో చినోర్‌ రోడ్డు వైపు నుంచి ధాన్యం లోడుతో వస్తున్న (పంజాబ్‌ రిజిస్ట్రేషన్‌) లారీ దిగువకు వెళ్తూ ఒక్కసారిగా అదుపుతప్పింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న భక్తుల పైనుంచి దూసుకెళ్లింది. రహదారి పక్కన ఉన్న తాత్కాలిక దుకాణాలనూ ఢీకొట్టి, చివరకు ఆలయ ప్రవేశద్వారాన్ని బలంగా తాకింది. ఈ ధాటికి ఆలయ ప్రహరీ గోడలో కొంత కూలినట్లు అధికారులు తెలిపారు. భక్తుల రద్దీని దృష్ట్యా ఆలయానికి వెళ్లే మార్గంలో భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. అయినప్పటికీ లారీ ఆ మార్గంలోకి ఎలా వచ్చిందన్నది ప్రశ్నార్థకంగా మారింది. పోలీసు బారికేడ్లను దాటి వాహనం ముందుకు వెళ్లినట్లు ప్రాథమిక సమాచారం. ప్రమాద సమయంలో విధుల్లో ఉన్న ఇద్దరు పోలీసు సిబ్బంది కూడా గాయపడ్డారు. మృతులు, క్షతగాత్రుల రోదనలతో ఆస్పత్రుల వద్ద హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. ట్రక్కు యజమాని, డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాగా, డ్రైవర్‌ గూగుల్‌ మ్యాప్‌ చూసి నిషేధిత మార్గంలోకి వచ్చి ఉంటాడని అధికారులు భావిస్తున్నారు. ఆ క్రమంలోనే బ్రేకుల ఫెయిలై భక్తులపైకి లారీ దూసుకెళ్లి ఉంటుందని అనుమానిస్తున్నారు.


సీఎం సీరియస్‌.. పోలీసులపై వేటు

ప్రమాదంపై మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ తీవ్రంగా స్పందించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినట్లు ఆరోపణలు రావడంతో గ్వాలియర్‌ సిటీ ఎస్పీని పదవి నుంచి తొలగించాలని ఆదేశించారు. మరో ఎనిమిది మంది పోలీసు సిబ్బందిని సస్పెండ్‌ చేశారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, నిషేధిత మార్గంలోకి లారీ ప్రవేశించడంపై సమగ్ర విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఘటనపై విచారం వ్యక్తం చేశారు.

Updated Date - Oct 19 , 2026 | 06:04 AM