గల్ఫ్‌లో ప్రార్థనా మందిరాల మూసివేత
ABN , Publish Date - Mar 03 , 2026 | 04:15 AM
ఇజ్రాయెల్-అమెరికా సంయుక్త దాడులు, ఇరాన్ ప్రతిదాడుల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఫలితంగా దుబాయి, అబుదాబీల్లో హిందూ దేవాలయాల్లో భక్తుల సందర్శనను నిరవధికంగా నిలిపివేశారు.
దుబాయిలో హిందూ దేవాలయాల్లో భక్తుల సందర్శనకు ‘నో’
రాత్రి వేళ నమాజు నిలిపేసిన కువైట్
మసీదులోనే ప్రార్థనలు చేయాలని ఖతార్ ఆదేశం
మక్కాకు వచ్చిన తెలుగు రాష్ట్రాల పౌరులు సౌదీలోనే
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)
ఇజ్రాయెల్-అమెరికా సంయుక్త దాడులు, ఇరాన్ ప్రతిదాడుల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఫలితంగా దుబాయి, అబుదాబీల్లో హిందూ దేవాలయాల్లో భక్తుల సందర్శనను నిరవధికంగా నిలిపివేశారు. అయితే దేవుళ్లకు దీపారాదనతోపాటు పూజారులు పూజలు చేస్తున్నారు.తామంతా యూఏఈ, గల్ఫ్‌లో సురక్షిత పాంత్రానికి వెళ్లేందుకు పూజలు చేస్తున్నట్లు హిందూ దేవాలయాల వర్గాలు తెలిపాయి. దుబాయితోపాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) లోని చర్చిలన్నీ తాత్కాలికంగా మూతపడ్డాయి. సీఎ్‌సఐ ఆధ్వర్యంలోని హోలీ ట్రినిటి తెలుగు విభాగంతోపాటు ఏ చర్చిలోనూ ఆదివారం సామూహిక ప్రార్థనలు జరుగలేదు. రంజాన్ మాసంలో రాత్రి వేళ మసీదులో చేసే తరావీ నమాజును కువైట్ రద్దు చేయగా, ఖతార్ మాత్రం మసీదు లోపలే ప్రార్థనలు చేయాలని ఆదేశించింది. రంజాన్ మాసంలో ఉమ్రా చేసేందుకు భారత్‌తోపాటు గల్ఫ్ దేశాల నుంచి మక్కాకు వచ్చి.. సౌదీలో చిక్కుకున్న వారిలో తెలుగు రాష్ట్రాల పౌరులు కూడా ఉన్నారు. ఇక తెలుగు క్రైస్తవుల ప్రాంతీయ సదస్సు పాల్గొనేందుకు 8 దేశాల నుంచి బహ్రెయిన్‌కు వచ్చిన తెలుగు చర్చిల ప్రతినిధు (ఫాస్టర్) లు అక్కడే చిక్కుకున్నారు. క్రైస్తవ ప్రతినిధులు బస చేసిన హోటల్.. సైనిక స్థావరానికి చేరువలో ఉండటంతోపాటు గగనతలం మూసేయడంతో వారిని బహ్రెయిన్‌లోని ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఉమ్రా కోసం మక్కాకు వచ్చిన తెలుగు రాష్ట్రాల యాత్రికులు ప్రయాణించిన విమానాలను సంబంధిత ఎయిర్‌లైన్స్ రద్దు చేయడంతో వారంతా సౌదీలో చిక్కుకున్నారు. సౌదీ అరేబియా విమానాల్లో వచ్చిన యాత్రికులు మాత్రం ఆ విమానాల ద్వారా తిరిగి గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. రంజాన్ పర్వదిన రద్దీ వల్ల యాత్రికులు తాము బస చేసిన హోటళ్లలో అదనపు దినాలు బసచేయడానికి వీల్లేకపోవడం సవాల్‌గా మారింది.