Share News

లవ్‌ మ్యారేజా..?తల్లిదండ్రులకు చెప్పాల్సిందే!

ABN , Publish Date - Feb 24 , 2026 | 04:29 AM

గుజరాత్‌లో వివాహ రిజిస్ట్రేషన్‌ చట్టం నిబంధనలకు పలు నూతన సవరణలు ప్రతిపాదించారు. అవి అమలులోకివస్తే ఇకపై అక్కడ జరిగే ప్రతి వివాహానికి ఆయా జంటల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.

లవ్‌  మ్యారేజా..?తల్లిదండ్రులకు చెప్పాల్సిందే!

  • వివాహ రిజిస్ట్రేషన్‌ చట్టానికి గుజరాత్‌ సర్కార్‌ సవరణలు

  • లవ్‌ జిహాద్‌, మోసగాళ్లను అడ్డుకోవడమే లక్ష్యమని వెల్లడి

  • వివాహం వయోజనుల రాజ్యాంగబద్ధమైన హక్కు

  • ఇప్పటికే పలు తీర్పుల్లో సుప్రీంకోర్టు స్పష్టీకరణ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23 : గుజరాత్‌లో వివాహ రిజిస్ట్రేషన్‌ చట్టం నిబంధనలకు పలు నూతన సవరణలు ప్రతిపాదించారు. అవి అమలులోకివస్తే ఇకపై అక్కడ జరిగే ప్రతి వివాహానికి ఆయా జంటల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. గుజరాత్‌ వివాహ రిజిస్ట్రేషన్‌ చట్టానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ సవరణల ప్రకారం వివాహం చేసుకోబోయే ప్రతి జంట ఆ విషయాన్ని తల్లిదండ్రులకు తప్పకుండా తెలియజేయాలి. వివాహ రిజిస్ట్రేషన్‌ అధికారులు కూడా తప్పనిసరిగా ఆయా జంటల తల్లిదండ్రులకు ఈ సమాచారం తెలియజేయాలి. గుజరాత్‌ అసెంబ్లీలో శుక్రవారం ప్రకటించిన ఈ సవరణలను లవ్‌ జిహాద్‌, తల్లిదండ్రులకు తెలియకుండా యువతీయువకులు వెళ్లిపోవడాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. గుజరాత్‌ హోం మంత్రి హర్ష్‌ సంఘ్వి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అమాయక బాలికలు మోసగాళ్ల వలలో పడుతున్నారని, సమాజానికి వీరు చెద పురుగుల్లా మారారని పేర్కొన్నారు. ఈ సమస్యని ప్రభుత్వం ఇక ఎంతమాత్రం ఉపేక్షించలేదన్నారు. కాగా గుజరాత్‌ ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ సవరణలు న్యాయ సమీక్షను ఎదుర్కోవాల్సి ఉంది. వయోజనులు తమకు ఇష్టమైన వారిని వివాహం చేసుకోవడం అనేది రాజ్యాంగబద్దమైన హక్కు అని సుప్రీంకోర్టు ఇప్పటికే అనేకసార్లు స్పష్టం చేసిన విషయం ఈ సందర్భంగా గమనార్హం. ఈ సవరణల ప్రకారం.. ప్రతి వివాహ రిజిస్ట్రేషన్‌ దరఖాస్తుతోపాటు యువతీయువకులు తమ తల్లిదండ్రులకు ఆ విషయాన్ని తెలియజేశారా.. లేదా అనే ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి. దరఖాస్తులో యువ జంట తమ పేర్లు, చిరునామాలు, ఆధార్‌ వివరాలు, ఫోన్‌ నెంబర్లు ఇవ్వాలి. ఆయా వివరాలతో అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ సంతృప్తి చెందితే పది పని దినాల్లోపు వారి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలి. 30 రోజుల అనంతరం వారి వివాహాన్ని నమోదు చేస్తారు. గుజరాత్‌ హోం మంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం ప్రేమ వివాహాలకు వ్యతిరేకం కాదన్నారు. అయితే ప్రేమ పేరిట జరిగే మోసాలను అడ్డుకోవడమే దీని లక్ష్యం అన్నారు. మోసపూరితంగా వివాహం చేసుకొనే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన పేర్కొన్నారు.

Updated Date - Feb 24 , 2026 | 04:29 AM