Share News

మంటల్లో బస్సు.. 9 మంది సజీవదహనం

ABN , Publish Date - Sep 25 , 2026 | 05:46 AM

ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్‌ నోయిడాలో బుధవారం రాత్రి జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 9 మంది ప్రయాణికులు మరణించారు. ఢిల్లీలోని కశ్మీర్‌ గేట్‌ నుంచి ఉత్తరప్రదేశ్‌ వెళ్తున్న పర్యాటకుల..

మంటల్లో బస్సు.. 9 మంది సజీవదహనం

  • గ్రేటర్‌ నోయిడాలో ఘోరం

  • పొగలు వస్తున్నాయని చెప్పినా పట్టించుకోని డ్రైవర్‌, కండక్టర్‌

  • మంటలు వ్యాపించగానే ప్రయాణికులను బస్సులోనే వదిలేసి పరార్‌

  • ఇద్దరు డ్రైవర్లు, కండక్టర్‌ అరెస్ట్‌

నోయిడా, సెప్టెంబరు 24: ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్‌ నోయిడాలో బుధవారం రాత్రి జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 9 మంది ప్రయాణికులు మరణించారు. ఢిల్లీలోని కశ్మీర్‌ గేట్‌ నుంచి ఉత్తరప్రదేశ్‌ వెళ్తున్న పర్యాటకుల డబుల్‌ డెక్కర్‌ స్లీపర్‌ బస్సు యమునా ఎక్స్‌ప్రెస్‌ రహదారిపై మరోబా వద్దకు రాగానే 33వ మైల్‌ వద్ద రాత్రి 11.30 గంటల సమయంలో మంటల్లో చిక్కుకుంది. బస్సులో పొగలు గమనించిన ప్రయాణికులు.. ఆపాలని కోరినా డ్రైవర్‌ వినకుండా అలాగే ముందుకు పోనివ్వటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో బస్సులో 35 మంది ప్రయాణిస్తున్నారు. వారిలో 9 మంది కాలిన గాయాలు, పొగతో ఊపిరాడక బస్సులోనే మరణించారు. కొందరు బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. మి గిలినవారిని ఫైర్‌ సిబ్బంది రక్షించారు.


డ్రైవర్‌, కండక్టర్‌ నిర్లక్ష్యం వల్లే..

బస్సు డ్రైవర్‌ పవన్‌, కండక్టర్‌ యోగేశ్‌ నిర్లక్ష్యం వల్లనే ఘోర ప్రమాదం జరిగిందని ప్రయాణికులు తెలిపారు. ‘బస్సు బుధవారం రాత్రి 9.30 గంటలకు ఢిల్లీలోని కశీర్‌ గేట్‌ నుంచి బయలుదేరింది. అది యూపీలోని గౌతమబుద్ధ నగర్‌లో ఆగాల్సి ఉంది. మహోబా వద్దకు రాగానే బస్సు ముందు భాగం నుంచి పొగలు రావటాన్ని గమనించిన కొందరు ప్రయాణికులు.. బస్సును ఆపాలని డ్రైవర్‌ను కోరారు. కానీ, అందుకు డ్రైవర్‌, కండక్టర్‌ నిరాకరించారు. ఇలాంటివి మామూలే. మీరు చస్తే చావండి కానీ.. బస్సును మాత్రం ఆపేది లేదు అని చెప్పారు. డ్రైవర్‌ సీటు కింది నుంచి మంటలు రావడంతో బస్సును ఆపేసి వారిద్దరూ అందులోంచి దూకేసి పారిపోయారు. బస్సుకు నిప్పంటుకుందని ఇతర ప్రయాణికులను మేము అప్రమత్తం చేసేలోపే మొత్తం పొగ నిండిపోయింది. మేము బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నాం’ అని సునీల్‌కుమార్‌ అనే ప్రయాణికుడు తెలిపాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి పవన్‌, యోగేశ్‌తోపాటు మరో డ్రైవర్‌ను కూడా గురువారం అరెస్టు చేశారు. కాగా, బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోదీ దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు.

Updated Date - Sep 25 , 2026 | 05:49 AM