స్టాలిన్, విజయన్ ప్రభుత్వాలతో గవర్నర్ల లడాయి!
ABN , Publish Date - Jan 21 , 2026 | 03:22 AM
తమిళనాడు, కేరళ ప్రభుత్వాలు, ఆ రాష్ట్ర గవర్నర్ల మధ్య మళ్లీ విభేదాలు తలెత్తాయి. తమిళనాడు అసెంబ్లీలో తమిళ గీతాలాపన తర్వాత జాతీయ గీతం ఆలపించాలని గవర్నర్ ఆర్‌ఎన్ రవి కోరగా..
తమిళనాడు అసెంబ్లీలో ప్రసంగమేచదవకుండా వెళ్లిపోయిన ఆర్‌ఎన్ రవి
చెన్నై-ఆంధ్రజ్యోతి/తిరువనంతపురం, జనవరి 20: తమిళనాడు, కేరళ ప్రభుత్వాలు, ఆ రాష్ట్ర గవర్నర్ల మధ్య మళ్లీ విభేదాలు తలెత్తాయి. తమిళనాడు అసెంబ్లీలో తమిళ గీతాలాపన తర్వాత జాతీయ గీతం ఆలపించాలని గవర్నర్ ఆర్‌ఎన్ రవి కోరగా.. స్పీకర్ నిరాకరించారు. దీంతో ఆయన ప్రసంగం చదవకుండానే సభ నుంచి వెళ్లిపోయారు. మంగళవారం ఉదయం 9.30 గంటలకు శాసనసభకు వచ్చిన గవర్నర్‌కు స్పీకర్ అప్పావు స్వాగతం పలికి.. హాలులోకి తోడ్కొని వెళ్లారు. సంప్రదాయానుగుణంగా తొలుత ‘తమిళ తల్లి’ ప్రార్థనా గీతాన్ని ఆలపించారు. ఆ వెంటనే జాతీయ గీతాలాపన చేయాలని రవి సూచించారు. అయితే గవర్నర్ ప్రసంగం అనంతరం జాతీయ గీతాలాపన ఉంటుందని, ఇదే సభ సంప్రదాయమని స్పీకర్ బదులిచ్చారు. ఆగ్రహించిన గవర్నర్ సభ నుంచి విసవిసా నిష్క్రమించారు. గవర్నర్ తీరును సీఎం స్టాలిన్ తీ వ్రంగా ఖండించారు. నిబంధనలు, సంప్రదాయాల ను ఆయన ఉల్లంఘించారని సభలో ఆరోపించారు.
కేరళ సీఎం వర్సెస్ లోక్‌భవన్
మంగళవారం కేరళ సభలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ 2 గంటలు ప్రసంగించి వెళ్లిపోయారు. ఆ తర్వాత సీఎం పినరయి విజయన్ మాట్లాడుతూ.. ప్రసంగ పాఠంలోని కొన్ని పేరాలను గవర్నర్ చదవలేదని చెప్పారు. అందులో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ద్రవ్య విధానంపైన.. బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా దీర్ఘకాలంగా పెం డింగ్‌లో ఉంచడంపై విమర్శలు ఉన్నందునే ఆయన కొన్ని పేరాలు చదవలేదని.. పైగా కొన్ని సొంత మాటలు చేర్చారని ఆరోపించారు. దీనిపై లోక్‌భవన్ తీవ్రంగా స్పందించింది. రాష్ట్రప్రభుత్వం పంపిన ప్రసంగం ముసాయిదాలో అర్ధసత్యాలు ఉండడంతో వాటిని తొలగించాలని గవర్నర్ కోరారని తెలిపింది.