రాష్ట్ర ప్రజలకు గవర్నర్, సీఎం గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
ABN , Publish Date - Jan 26 , 2026 | 03:26 AM
సామాజిక సాధికారతలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని, తెలంగాణ రైజింగ్-2047 విజన్‌తో రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరతాయని ప్రభుత్వం విశ్వసిస్తుందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు.
హైదరాబాద్, జనవరి 25 (ఆంధ్రజ్యోతి) : సామాజిక సాధికారతలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని, తెలంగాణ రైజింగ్-2047 విజన్‌తో రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరతాయని ప్రభుత్వం విశ్వసిస్తుందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ ఏర్పాటు.. అందుకు జరిగిన పోరాటం, నిజాం పాలన, రజాకార్ల దాడులు, భారత సైన్యం రంగ ప్రవేశం తదితర అంశాలను గుర్తుచేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం తక్కువ సమయంలో ప్రజాహిత పాలన అందిస్తూ అనేక గణనీయమైన విజయాలను సాధించిందని గవర్నర్ పేర్కొన్నారు. తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అడుగులు వేయడం జరుగుతుందని, ఇది రాష్ట్ర అభివృద్ధికి శక్తివంతమైన రోడ్‌మ్యా్‌పగా నిలుస్తుందని వివరించారు. రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజాస్వామిక, గణతంత్ర, లౌకిక, సామ్యవాద, సార్వభౌమ దేశంగా భారతదేశం ప్రగతిపథంలో దూసుకెళ్లాలని, అందుకు ఆధారమైన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26వ తేదీ దేశ ప్రజలకు పండుగలాంటిదన్నారు. కాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.