Issues Second Notice to X: ఎక్స్‌కు రెండో నోటీసు.. చట్టపరమైన చర్యలకు కేంద్రం సిద్ధం!
ABN , Publish Date - Jan 11 , 2026 | 03:20 AM
ఎలాన్ మస్క్‌కు చెందిన ప్రముఖ సామాజిక మాధ్యమ వెబ్‌సైట్ ఎక్స్‌పై భారత ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది.
న్యూఢిల్లీ, జనవరి 10 : ఎలాన్ మస్క్‌కు చెందిన ప్రముఖ సామాజిక మాధ్యమ వెబ్‌సైట్ ఎక్స్‌పై భారత ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ఎక్స్‌లోని గ్రోక్ ఏఐ చాట్‌బాట్ సృష్టించిన అసభ్య, అశ్లీల కంటెంట్‌ను తక్షణమే తొలగించాలని, తీసుకున్న చర్యలపై 72 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని కేంద్ర ఐటీ శాఖ జనవరి 2న ఎక్స్‌కు నోటీసులు జారీ చేసింది. అయితే, అసభ్య కంటెంట్ అంశంలో తగిన చర్యలు తీసుకోని ఎక్స్.. తమ సంస్థ విధానాలను మారుస్తున్నామని కేంద్రానికి బదులిచ్చింది. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన కేంద్రం.. సమస్యను పరిష్కరించడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలిపేలా ఆధారాలు సమర్పించాలని ఆదేశిస్తూ రెండో నోటీసును గురువారం జారీ చేసింది. ఇక, ఎక్స్ తగిన రీతిలో స్పందించకపోతే చట్టప్రకారం కచ్చితంగా చర్యలు తీసుకుంటామని కేంద్ర ఐటీ శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు.