Hikes Taxes on Cigarettes: సిగరెట్లు మరింత ప్రియం
ABN , Publish Date - Jan 02 , 2026 | 04:15 AM
సిగరెట్లు తాగేవారికి, పాన్ మసాలాలు వాడే వారికి కేంద్రం గట్టి షాకిచ్చింది. పొగాకు ఉత్పత్తులపై భారీగా పన్నులు పెంచనుంది. ఒక్కో సిగరెట్ ధర దాదాపు 3 నుంచి 4 రెట్లు పెరగనుంది.
పాన్ మసాలాల ధరలూ భారీగానే.. పొగాకు ఉత్పత్తులపై కేంద్రం వడ్డన
40ు జీఎస్టీ, అదనపు సుంకం
బీడీలపై మాత్రం 18 శాతం జీఎస్టీ
ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి
న్యూఢిల్లీ, జనవరి 1: సిగరెట్లు తాగేవారికి, పాన్ మసాలాలు వాడే వారికి కేంద్రం గట్టి షాకిచ్చింది. పొగాకు ఉత్పత్తులపై భారీగా పన్నులు పెంచనుంది. ఒక్కో సిగరెట్ ధర దాదాపు 3 నుంచి 4 రెట్లు పెరగనుంది. అలాగే పాన్ మసాలాల ధరలు భారీగానే పెరగనున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి కొత్త పన్నులు వర్తిస్తాయి. పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలాల వాడకాన్ని నియంత్రించే ప్రయత్నంలో భాగంగా వాటిపై పన్నులు పెంచనున్నట్టు కేంద్రం ప్రకటించింది. ‘హానికారక వస్తువులు’ కోసం ఇటీవల సవరించిన జీఎస్టీ రేటు కంటే పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలాలపై అదనపు చార్జీలు విధిస్తారు. ఇలాంటి వస్తువులపై ప్రస్తుతం విధిస్తున్న పరిహార సెస్ స్థానంలో ఇవి వర్తిస్తాయి. సిగరెట్లపై 40 శాతం జీఎస్టీతో పాటు అదనపు ఎక్సైజ్ సుంకం విధిస్తారు. సిగరెట్ల ధరలో 53 శాతం పన్నుల రూపంలో ప్రభుత్వానికి వెళ్తుంది. కాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశం ప్రకారం 75 శాతం పన్నులు వేయాలి. ఇక పాన్ మసాలాలపై అదనపు ఎక్సైజ్ సుంకం స్థానంలో ఆరోగ్య, జాతీయ భద్రత సెస్ విధిస్తారు. 40 శాతం జీఎస్టీ ఉంటుంది. నమిలే పొగాకు, జర్దా సువాసన గల పొగాకు, గుట్కా ప్యాకింగ్ యంత్రాల (సామర్థ్య నిర్ధారణ, సుంకం వసూలు) నియమాలు-2026ను కేంద్ర ఆర్థిక శాఖ కూడా నోటిఫై చేసింది. కాగా సిగరెట్లతో పోలిస్తే బీడీలపై జీఎస్టీ రేటు తక్కువగా 18 శాతం ఉంటుంది. బీడీ పరిశ్రమలలో అందులోనూ ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే కార్మికుల జీవనోపాధి కాపాడటానికి జీఎస్టీ రేటు తక్కువగా వేసినట్టు సమాచారం.