జనాకర్షక బడ్జెట్!
ABN , Publish Date - Jan 28 , 2026 | 03:16 AM
జనాకర్షక బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ సారి బడ్జెట్‌లో కీలక సంస్కరణలు, ప్రకటనలు వె లువడే అవకాశముంది.
కీలక సంస్కరణలు, ప్రకటనలకు కేంద్రం సిద్ధం
నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
రాష్ట్రపతి ప్రసంగంతో ప్రారంభం
ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్
రాజ్‌నాథ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ
న్యూఢిల్లీ, జనవరి 27(ఆంధ్రజ్యోతి): జనాకర్షక బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ సారి బడ్జెట్‌లో కీలక సంస్కరణలు, ప్రకటనలు వె లువడే అవకాశముంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ అనిశ్చితి మధ్య భారత ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేలా ఈ బడ్జెట్ ఉండబోతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఉద్యోగులు, మధ్య తరగతి, రైతులు, కూలీలు ఇలా అన్ని వర్గాలకు ప్రయోజనాలు కలిగేలా బడ్జెట్‌లో ప్రతిపాదనలు ఉండే అవకాశం ఉంది. ప్రధానంగా భార్యాభర్త లు ఇద్దరూ ఉమ్మడిగా ఆదాయ పన్ను రిటర్న్ దాఖ లు చేసే అవకాశం, వైద్య రంగంలో స్వదేశీ తయారీ, బ్యాంకింగ్, ఆర్థిక సేవల్లో డిజిటల్ విప్లవం, స్టార్టప్, ఇన్నోవేషన్-డీ్‌పటెక్ వైపు అడుగులు, కస్టమ్స్ సుంకా ల హేతుబద్ధీకరణ తదితరాలపై కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. రెండు విడతలుగా జరిగే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 13 వరకు మొదటి విడత, మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు రెండో విడత నిర్వహిస్తారు. మొత్తం 30 రోజులు ఉభయ సభలు సమావేశం కానున్నాయి. తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడతారు. ఆమె వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. మరోవైపు, పార్లమెంటు చరిత్రలోనే తొలిసారిగా ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఫిబ్రవరి 2 నుంచి 4 వరకు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సాగనుంది.
నరేగా రద్దుపై చర్చకు విపక్షాల పట్టు
బడ్జెట్ సమాశాల్లో నరేగా (మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం) రద్దు, ఎస్‌ఐఆర్, యూజీసీ కొత్త మార్గదర్శకాలు వంటి అంశాలను లేవనెత్తాలని, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఆర్థిక, విదేశాంగ విధానాల్లో కీలకాంశాలపై స్పష్టత కోసం డిమాండ్ చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మంగళవారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ నివాసంలో కీలక భేటీ జరిగింది. పార్టీ అధ్యక్షుడు మలికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు. అలాగే వివిధ విపక్ష పార్టీల నేతలు కూడా ఉమ్మడి వ్యూహాన్ని ఖరారు చేసేందుకు బుధవారం ఉదయం పార్లమెంటు హౌస్‌లోని ఖర్గే చాంబర్‌లో భేటీ కానున్నారు. కాగా, మంగళవారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. పార్లమెంటు సమావేశాల్లో నరేగా రద్దు, ఎస్‌ఐఆర్, ఓట్ చోరీ, యూజీసీ కొత్త మార్గదర్శకాలు, కొత్త విదేశాంగ విధానం, వరి సేకరణ సహా ఇతర అంశాలపై చర్చించాలని కాంగ్రెస్ సహా విపక్షాలు డిమాండ్ చేశాయి. కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో గవర్నర్ల ఆఫీసులను దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలపై చర్చకు డీఎంకే, టీఎంసీ, వామపక్ష పార్టీలు పట్టుబట్టాయి. మరోవైపు ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న టీడీపీ అమరావతి రాజధాని బిల్లు అంశాన్ని లేవనెత్తింది. రాజ్యసభలో సభా నాయకుడు జేపీ నడ్డా, పార్లమెంటువ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, సహాయ మంత్రులు అర్జున్‌రామ్ మేఘ్వాల్, డాక్టర్ ఎల్.మురుగన్‌లతో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు(తెలుగుదేశం), బాలశౌరి(జనసేన), కేఆర్ సురేష్ రెడ్డి (బీఆర్‌ఎస్), మిథున్ రెడ్డి (వైసీపీ) తదితరులు హాజరయ్యారు.
వీబీ జీ రామ్ జీ చట్టాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు: రిజిజు
కొత్తగా తీసుకొచ్చిన వీబీ జీ రామ్ జీ చట్టాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తేల్చిచెప్పారు. అఖిలపక్ష సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్‌ఐఆర్‌పై ప్రతిపక్షాల డిమాండ్ సరికాదన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, బడ్జెట్ చర్చల సమయంలో కూడా వివిధ అంశాలను లేవనెత్తవచ్చని సభ్యులకు సూచించామని తెలిపారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని విపక్షాలను ఆయన కోరారు.