గడప దాటుతున్న పాత బంగారం
ABN , Publish Date - Jun 30 , 2026 | 04:31 AM
సగటు భారతీయులకు ఎన్నిరకాల ఆస్తులున్నా.. అతిగా మనసుపడే ఆస్తి మాత్రం బంగారమే. ఎంతోకొంత బంగారం లేని ఇల్లు కనిపించదంటే అతిశయోక్తి కాదు.
ధర పతనంతో అమ్మేస్తున్న ప్రజలు
ధర మరింత పడిపోతుందని భయాలు
అమ్ముకోవద్దని నిపుణుల సూచన
న్యూఢిల్లీ, జూన్ 29: సగటు భారతీయులకు ఎన్నిరకాల ఆస్తులున్నా.. అతిగా మనసుపడే ఆస్తి మాత్రం బంగారమే. ఎంతోకొంత బంగారం లేని ఇల్లు కనిపించదంటే అతిశయోక్తి కాదు. ఇక ఆస్తిపరులైతే అవసరానికి మించి బంగారం కొని దాచుకుంటుంటారు. పెట్టుబడులు పెట్టేవారు చాలామంది కొంతకాలంగా రియల్ ఎస్టేట్, స్టాక్‌మార్కెట్లను వదిలి బంగారం కోసం పరుగులు పెడుతున్నారు. గత ఏ డాది నుంచి బంగారం ధరలు ఆకాశాన్ని తాకటంతో ఈ ట్రెండ్ మరింత పెరిగింది. అయితే, కొద్దిరోజులుగా బంగారం ధరల్లో ఒడిదుడుకులు చోటుచేసుకుంటుండటంతో ఇళ్లల్లో ఉన్న పాతబంగారాన్ని విక్రయించటానికి పరుగులు పెడుతున్నారు. బంగారం ధరలు మరింత పడిపోతాయనే భయంతో ఇప్పుడే అమ్మేసి సొమ్ముచేసుకోవాలనే ఆ లోచనతో ప్రజలు పాతబంగారాన్ని అమ్ముతున్నట్లు ఇండియా బులియన్, జ్యువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) జాతీయ కార్యదర్శి సురేంద్ర మెహతా తెలిపారు.
మూడు నెలల్లో 50 టన్నులు విక్రయం
మనదేశంలో సంవత్సర కాలంగా బంగారం ధర ఊహించని విధంగా పెరిగింది. రిటైల్ మార్కెట్‌లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ఈ ఏడాది మార్చి 2న ఆల్‌టైమ్ రికార్డు సృష్టిస్తూ రూ.1,69,349కి చే రింది. మల్టీ కమొడిటీ ఎక్స్‌చేంజ్ (ఎంసీఎక్స్) ఫ్యూ చర్ ట్రేడింగ్‌లో 10 గ్రాములు ఏకంగా రూ. 1,92,991 పలికింది. దీంతో రిటైల్ మార్కెట్‌లోనూ 10 గ్రాము లు రూ.2 లక్షలు దాటుతుందని అంచనా వేశారు. కానీ, అంతర్జాతీయ పరిణామాలతో బంగారం ధర ఒక్కసారిగా పడిపోవటం మొదలైంది. సోమవారం హైదరాబాద్‌లో రిటైల్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,43,020కి చేరింది. ధర ఇంకా పడిపోయి రూ. 1,20,000లకు చేరుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. అదే జరిగితే మరింత నష్టపోతామనే భయంతో పెట్టుబడిదారులతోపాటు సామాన్యులు కూడా తమవద్ద ఉన్న బంగారాన్ని అమ్ముకోవటానికి మార్కెట్‌కు పరుగులు పెడుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ - జూన్ త్రైమాసికంలో 50 టన్నుల పాత బంగారాన్ని ప్రజలు విక్రయించినట్లు సురేంద్ర మెహతా తెలిపారు. గతేడాది ఇదే కాలంతో పోల్చితే ఇది 43శాతం అధికమని వివరించారు. విలువ తగ్గిపోతుందన్న భయంతో ప్రజలు ఎంతోకాలంగా భద్రంగా దాచుకున్న బంగారాన్ని కూడా అమ్మేస్తున్నారని చెప్పారు.
బంగారం రీసైక్లింగ్ మార్కెట్‌కు ఊతం
మనదేశం 2025-26ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.6.84 లక్షల కోట్ల విలువైన బంగారాన్ని దిగుమ తి చేసుకుంది. ప్రస్తుతం సామాన్య ప్రజల వద్ద 30,000 టన్నుల బంగారం ఉందని అంచనా. ధరలు పడిపోయి పాతబంగారం విక్రయాలు జోరందుకోవటంతో దేశంలో బంగారం రీసైక్లింగ్ పరిశ్రమ పండ గ చేసుకుంటోంది. మార్కెట్‌లోకి వచ్చిన పాతబంగారాన్ని శుద్ధిచేసి, ఈ పరిశ్రమ దానిని కొత్తబంగారం గా మళ్లీ మార్కెట్‌లోకి పంపుతోంది. 2025లో ఇలా మార్కెట్‌లోకి 125-150 టన్నుల వరకు వెళ్లిందని అంచనా. ఈ ఏడాది పాతబంగారం అమ్మకాలు ఇలాగే కొనసాగితే.. రీసైక్లింగ్ పరిశ్రమ నుంచి మా ర్కెట్‌లోకి 250 టన్నుల వరకు వస్తుందని మార్కెట్ వర్గాలంటున్నాయి. దేశవ్యాప్తంగా తమకున్న 100కు పైగా పాత బంగారం సేకరణ సెంటర్లలో వ్యాపారం 40శాతం పెరిగినట్లు ముతూట్ ఎగ్జిమ్ సీఈవో కేయూ ష్ షా తెలిపారు. అయితే, ధరలు మరిం త పడిపోతాయని పాత బంగారాన్నంతా అమ్ముకోవ టం తెలివైన పని కాదని మార్కెట్ నిపుణులు అం టున్నారు. డబ్బు అవసరమైతే అమ్ముకోవచ్చని, భవిష్యత్తులో బంగారం ధర పెరుగుతుందని చెబుతున్నారు.