పసిడి డిమాండ్ ఢమాల్!
ABN , Publish Date - May 31 , 2026 | 05:03 AM
దేశంలో బంగారానికి డిమాండ్ భారీగా తగ్గిపోయింది. ఏకంగా 70శాతం మేరకు డిమాండ్ పడిపోయిందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
70 శాతం తగ్గిన గిరాకీ
పనిచేసిన ప్రధాని పిలుపు
కోల్‌కతా, మే 30: దేశంలో బంగారానికి డిమాండ్ భారీగా తగ్గిపోయింది. ఏకంగా 70శాతం మేరకు డిమాండ్ పడిపోయిందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఒక ఏడాదిపాటు బంగారం కొనుగోళ్లను వాయిదా వేసుకోవాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుతోపాటు పసిడి దిగుమతులపై సుంకాన్ని 6 నుంచి 15శాతం పెంచిన నేపథ్యంలో స్వర్ణ విక్రయాలు డీలా పడ్డాయని వ్యాపారులు తెలిపారు. గత ఏడాది మే నెలలో 25 టన్నుల మేరకు బంగారం డిమాండ్ ఉండగా.. ఈ నెల 13న సుంకాలు పెంచిన తర్వాత పక్షం రోజుల్లో ఇది 7.5 టన్నులకు పడిపోయిందని పేర్కొన్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధన, వంట గ్యాస్ ధరలు పెరగడంతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో బంగారాన్ని కొనుగోలు చేసేవారి సంఖ్య తగ్గిపోయిందని, ఇక, దిగుమతులపై సుంకాల పెంచడంతో ఆ ప్రభావం మరింత ఎక్కువగా పడిందని వ్యాపారులు తెలిపారు. ఇండియన్ బులియన్, జ్యుయలరీ అసోసియేషన్(ఐబీజేఏ) కార్యదర్శి సురేంద్ర మెహతా మాట్లాడుతూ.. దేశంలో బంగారం కొనుగోలు చేసేవారు భారీ గా తగ్గిపోయారన్నారు. ‘‘దిగుమతి సుంకంతోపాటు జీఎస్టీ కూడా పెరిగింది. ప్రస్తు తం పసిడిపై అన్ని రకాల పన్నులు 9.18శాతం నుంచి 18.45 శాతానికి చేరాయి. దీంతో వినియోగదారుల ప్రాధాన్యతా జాబితాలో పసిడి పక్కకు పోయింది’’ అని పేర్కొన్నారు. జోయాలుక్కాస్ సంస్థ చైర్మన్ జాయ్ అలుక్కాస్ మాట్లాడుతూ.. బంగారం డిమాండ్ తగ్గిపోవడానికి కేవలం దిగుమతి సుంకం ప్రభావమే కాకుండా మరిన్ని కారణాలు ఉన్నాయన్నారు. ముఖ్యంగా ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు వినియోగదారులపై ప్రభావం చూపించిందని తెలిపారు. కాగా, శుక్రవారం స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర జీఎస్టీ లేకుండా రూ.1.57 లక్షలుగా నమోదైంది. దీంతో కొంతమంది వినియోగదారులు.. తక్కువ క్యారెట్ల బంగారం కొనుగోలుకు మొగ్గుచూపుతున్నట్టు వ్యాపారులు తెలిపారు.