ఢిల్లీ వీధుల్లో అడుగడుగునా నా పోస్టర్లే!
ABN , Publish Date - Jun 26 , 2026 | 04:01 AM
ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తన కొత్త పుస్తకం ‘జార్జియాస్ విజన్’లో 2023 నాటి భారత పర్యటనకు సంబంధించిన ఒక విశేషాన్ని పంచుకున్నారు.
అక్కడ పోటీ చేస్తే పది లక్షల ఓట్లు పడతాయన్నారు
2023 నాటి భారత పర్యటనను గుర్తుచేసుకున్న మెలోని
న్యూఢిల్లీ, జూన్ 25: ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తన కొత్త పుస్తకం ‘జార్జియాస్ విజన్’లో 2023 నాటి భారత పర్యటనకు సంబంధించిన ఒక విశేషాన్ని పంచుకున్నారు. తన రాకకు స్వాగతం పలుకుతూ ఢిల్లీ వీధుల్లో భారీగా పోస్టర్లు ఏర్పాటు చేశారని గుర్తుచేసుకున్నారు. ‘నేను ఢిల్లీ వచ్చినప్పుడు రోడ్లపై అడుగడుగునా నా ఫొటోలతో కూడిన పోస్టర్లు కనిపించాయి. నేను తిరిగి వెళ్తున్నప్పుడు అదే చిత్రంతో కూడిన పోస్టర్లపై ‘భారత్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు’ అని రాసి ఉంది. ఆ పర్యటనలో నాతో పాటు వచ్చిన ఇటలీ ఉప ప్రధాని ఆంటోనియో తజనీ ఆ పోస్టర్లు చూసి ఆశ్చర్యపోయారు. ఢిల్లీ నియోజకవర్గం నుంచి మీరు పోటీ చేస్తే కచ్చితంగా పది లక్షల ఓట్లు సాధిస్తారని ఆయన చమత్కరించారు’ అని మెలోని పేర్కొన్నారు. ‘రెసినా డైలాగ్’ సదస్సుకు హాజరయ్యేందుకు 2023 మార్చిలో, ఆ తర్వాత జీ20 శిఖరాగ్ర సమావేశం కోసం అదే ఏడాది సెప్టెంబరులో ఆమె భారత్‌ను సందర్శించారు. పాత్రికేయుడు అలెశాండ్రో సల్లూస్టీతో ఆమె జరిపిన సంభాషణల ఆధారంగా రూపొందిన ఈ పుస్తకానికి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ముందుమాట రాశారు. పలువురు దేశాధినేతలతో తనకున్న పరిచయాలు, వ్యక్తిగత స్నేహాల గురించి అందులో మెలోని ప్రస్తావించారు.