అసంఘటిత, గిగ్ కార్మికుల కోసం జాతీయ సామాజిక భద్రతా బోర్డులు
ABN , Publish Date - Oct 31 , 2026 | 02:59 AM
దేశంలో భారీ సంఖ్యలో ఉన్న అసంఘటిత, గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికులకు సమగ్ర సామాజిక భద్రతను కల్పించే దిశగా కేంద్రప్రభుత్వం కీలక ముందడుగు వేసింది.
గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రప్రభుత్వం
న్యూఢిల్లీ, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): దేశంలో భారీ సంఖ్యలో ఉన్న అసంఘటిత, గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికులకు సమగ్ర సామాజిక భద్రతను కల్పించే దిశగా కేంద్రప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. సామాజిక భద్రతా కోడ్- 2020 చట్టం కింద అసంఘటిత రంగంలోని కార్మికులు, గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్ల కోసం రెండు వేర్వేరు జాతీయ సామాజిక భద్రతా బోర్డులను ఏర్పాటు చేస్తూ కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఆయా కార్మికుల మధ్య సామాజిక భద్రతా అంతరాన్ని పూడ్చేలా లక్ష్యిత సంక్షేమ పథకాలను రూపొందించడం, పర్యవేక్షించడం, సిఫార్సు చేయడం ఈ బోర్డుల ప్రధాన విధి. ఈ బోర్డులు నోటిఫికేషన్ ప్రచురితమైన తేదీ నుంచి మూడేళ్ల పాటు అమల్లో ఉంటాయి. ఈ రెండు బోర్డులకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి చైర్‌పర్సన్‌గా, ఆ శాఖ కార్యదర్శి వైస్ చైర్‌పర్సన్‌గా ఉంటారు. వీటిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రముఖ అగ్రిగేటర్ కంపెనీలు, వాటి యజమానులు, పౌర సమాజ సంస్థలు, కార్మిక సంఘాలు, గిగ్ వర్కర్లు, ప్లాట్‌ఫామ్ కార్మిక సంఘాల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. అసంఘటిత కార్మికుల బోర్డులో సభ్యులుగా భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి. శ్రీనివాస్, పౌరసమాజం తరపున హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్ జలిగాం సభ్యులుగా నామినేట్ అయ్యారు. ఏపీ తరఫున కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శికి ఈ బోర్డులో చోటు దక్కింది. గిగ్ వర్కర్ల బోర్డులో ఏపీ నుంచి కార్మిక శాఖ కమిషనర్ సభ్యుడిగా ఉన్నారు.