Share News

నేడు గిగ్‌ వర్కర్ల దేశవ్యాప్త సమ్మె

ABN , Publish Date - Jan 26 , 2026 | 04:09 AM

ఒక్క క్లిక్‌తో ఆహార పదార్థాలను చేతికి అందించే స్విగ్గీ, జొమాటో సేవలు సోమవారం నిలిచిపోనున్నాయి. అలాగే, నిత్యావసర వస్తువులను గుమ్మం ముందుకు తెచ్చే జెప్టో, బ్లింకింట్‌ వంటి యాప్‌లు నో సర్వీస్‌ మెసేజ్‌లతో దర్శనమివ్వనున్నాయి.

నేడు గిగ్‌ వర్కర్ల దేశవ్యాప్త సమ్మె

న్యూఢిల్లీ, జనవరి 25 : ఒక్క క్లిక్‌తో ఆహార పదార్థాలను చేతికి అందించే స్విగ్గీ, జొమాటో సేవలు సోమవారం నిలిచిపోనున్నాయి. అలాగే, నిత్యావసర వస్తువులను గుమ్మం ముందుకు తెచ్చే జెప్టో, బ్లింకింట్‌ వంటి యాప్‌లు నో సర్వీస్‌ మెసేజ్‌లతో దర్శనమివ్వనున్నాయి. అంతేకాదు, ర్యాపిడో, ఓలా, ఊబర్‌ వంటి యాప్‌లతో పాటు లాజిస్టిక్స్‌, ఈ-కామర్స్‌, డొమెస్టిక్‌ హెల్ప్‌ వంటి అనేక గిగ్‌ యాప్‌ల సేవలకు అంతరాయం కలగనుంది. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని గిగ్‌ వర్కర్లు దేశవ్యాప్తంగా ఒక రోజు సమ్మెకు దిగుతున్నారు. ఇందులో భాగంగా సోమవారం వర్కర్లంతా గిగ్‌ యాప్‌ల నుంచి లాగౌట్‌ చేస్తారు. తద్వారా డెలివరీలు, వాహన రైడ్‌లు, గృహ అవసర సేవలకు వారు దూరంగా ఉంటారు. దీంతో గిగ్‌ యాప్‌ల సేవలకు అంతరాయం ఏర్పడుతుంది. పనికి తగిన గౌరవం, సామాజిక గుర్తింపు, గిగ్‌ రంగంలో అవసరమైన రక్షణ హక్కులు కల్పించాలన్నదే వారి ప్రధాన డిమాండ్‌. తమ సామాజిక, ఆరోగ్య భద్రత, బీమా కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తేవాలని కోరుతున్నారు. తమ వివరణ కోరకుండా ఇష్టానుసారంగా అకౌంట్‌ను బ్లాక్‌ చేసే విధానంపై నిషేధం విధించాలని, ఫిర్యాదులను సరైన విధానంలో పరిష్కరించే మార్గదర్శకాలను రూపొందించాలని డిమాండ్‌ చేస్తున్నారు. మహిళా వర్కర్లు వేధింపులు, ఇబ్బందులకు గురైనప్పుడు వారికి వెంటనే ఉపయోగపడేలా యాప్‌లలో ఎమర్జెన్సీ బటన్‌ను అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు. అంతేకాదు, ఫిబ్రవరి 3న దేశవ్యాప్త ఆందోళనలకు వారు సిద్ధమవుతున్నారు.

Updated Date - Jan 26 , 2026 | 07:56 AM