Share News

బక్రీద్‌ రోజున బాలుడిని హత్య చేసిన నిందితుడు ఎన్‌కౌంటర్‌లో ఖతం

ABN , Publish Date - Jun 01 , 2026 | 04:01 AM

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో బక్రీద్‌ నాడు జరిగిన 17 ఏళ్ల మైనర్‌ బాలుడి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన...

బక్రీద్‌ రోజున బాలుడిని హత్య చేసిన నిందితుడు ఎన్‌కౌంటర్‌లో ఖతం

ఘజియాబాద్‌, మే 31: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో బక్రీద్‌ నాడు జరిగిన 17 ఏళ్ల మైనర్‌ బాలుడి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అసద్‌ శనివారం అర్ధరాత్రి పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు. ఘజియాబాద్‌లోని ఖోరా కాలనీకి చెందిన సూర్య ప్రతాప్‌ చౌహాన్‌ను స్థానికంగా ఉండే ఓ మిత్రుడు బక్రీద్‌ పండుగ సందర్భంగా తన ఇంటికి ఆహ్వానించాడు. దీంతో స్నేహితులతో కలిసి ఆ ప్రాంతానికి వెళ్తున్న సూర్యకు, అసద్‌ అనే వ్యక్తి ఎదురయ్యాడు. ఈ క్రమంలో ఓ బైక్‌ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం తలెత్తింది. ఆ సమయంలో అసద్‌ సూర్యతో ‘‘నువ్వు ఎప్పుడైనా మేకను హలాల్‌ చేయడం చూశావా?’’ అని అడగ్గా, సూర్య ‘‘లేదు’’ అని సమాధానమిచ్చాడు. దానికి అసద్‌ ‘‘రా చూపిస్తా’’ అంటూ కత్తితో సూర్యను పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఈ మేరకు సూర్య కుటుంబసభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఘజియాబాద్‌ పోలీసులు, నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఓ చోట పోలీసులు కాపు కాయగా.. అటుగా వచ్చిన అసద్‌ వారిని గమనించి కాల్పులు జరుపుతూ పారిపోవడానికి ప్రయత్నించాడు. ఈ కాల్పుల్లో ఓ కానిస్టేబుల్‌ గాయపడ్డారు. పోలీసులు ఆత్మరక్షణ కోసం ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అసద్‌ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన నిందితుడిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ అతడు మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసుతో సంబంధం ఉన్న అసద్‌ తండ్రి సహా మరో ముగ్గురిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.

Updated Date - Jun 01 , 2026 | 04:01 AM