జన్యువుల చేతుల్లోనే మన ఆయుష్షు
ABN , Publish Date - Feb 04 , 2026 | 02:21 AM
మనం ఎంతకాలం జీవిస్తామనేది మన చేతుల్లో లేదు! మన జన్యువుల మీద ఆధారపడి ఉంటుంది. తాజాగా వెలువడిన అధ్యయనం ప్రకారం, ఒక వ్యక్తి జీవితకాల పరిమితిని నిర్ణయించడంలో జన్యువుల పాత్ర...
దానికి పరిమితి నిర్ణయించేవి అవే
జీవనశైలి బాగుంటేనే ఆ పరిమితికి
లేకుంటే మధ్యలోనే మరణం
తాజా పరిశోధనలో వెల్లడి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: మనం ఎంతకాలం జీవిస్తామనేది మన చేతుల్లో లేదు! మన జన్యువుల మీద ఆధారపడి ఉంటుంది. తాజాగా వెలువడిన అధ్యయనం ప్రకారం, ఒక వ్యక్తి జీవితకాల పరిమితిని నిర్ణయించడంలో జన్యువుల పాత్ర 55ు వరకు ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. గతంలో ఈ ప్రభావం కేవలం 10-25 శాతమే ఉంటుందని భావించేవారు. మంచి ఆహారం, వ్యాయామం, ఒత్తిడికి దూరంగా ఉండడం వంటివి ఆయుష్షు పరిమితిని పూర్తిగా చేరుకోవడానికి దోహదపడతాయి. ఒకవేళ జీవనశైలి సరిగ్గా లేకపోతే, జన్యుపరంగా ఉన్న ఆయుష్షు కంటే ముందే మరణం సంభవించే అవకాశం ఉంటుంది. అంటే, వ్యాయామం, పౌష్టికాహారం అనేవి ఉన్న ఆయుష్షును కాపాడుకోవడానికి పనికొస్తాయి తప్ప, మన జన్యువులు నిర్ణయించిన గరిష్ఠ పరిమితిని దాటి జీవించలేమని ఈ పరిశోధన స్పష్టం చేస్తోంది. ప్రముఖ జర్నల్ ‘సైన్స్’లో తెలిపిన వివరాల ప్రకారం.. డెన్మార్క్, స్వీడన్ దేశాలకు చెందిన కవలల జీవితకాల డేటా ఆధారంగా ఈ ఫలితాలను వెల్లడించారు. ముఖ్యంగా ఇన్ఫెక్షన్లు, ప్రమాదాల వల్ల చనిపోయిన వారిని మినహాయించి చూసినప్పుడు జన్యువుల అసలు ప్రభావం బయటపడింది. అయితే, ఇది భారతీయుల్లో కాస్త ఆందోళన కలిగించే అంశమేనని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మనకు దీర్ఘాయువునిచ్చే జన్యువులు ఉన్నప్పటికీ, దేశంలోని కాలుష్యం, పోషకాహార లోపం లాంటి పరిస్థితులు ఆ ప్రయోజనాన్ని హరించివేసే ప్రమాదం ఉందన్నారు.