దేశవ్యాప్తంగా గ్యాస్ తిప్పలు!
ABN , Publish Date - Mar 14 , 2026 | 04:22 AM
మన దేశంలో ఇప్పటికిప్పుడు గ్యాస్ సమస్యలు లేవని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం వంట గ్యాస్ సరఫరా వ్యవహారం ప్రజలకు చుక్కలు చూపిస్తోంది...
న్యూఢిల్లీ, మార్చి 13: మన దేశంలో ఇప్పటికిప్పుడు గ్యాస్ సమస్యలు లేవని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం వంట గ్యాస్ సరఫరా వ్యవహారం ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. సిలిండర్ల డెలివరీ, బ్లాక్ మార్కెటింగ్ వంటివి గత వారం రోజులుగా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ‘లోకల్ సర్కిల్స్’ నిర్వహించిన దేశవ్యాప్త సర్వేలో 57 శాతం మంది స్పష్టం చేశారు. దేశంలోని 309 జిల్లాల్లో నిర్వహించిన సర్వేలో 57 వేల మంది పాల్గొన్నారు. వీరిలో టైర్-1 జిల్లాల నుంచి 40శాతం, టైర్-2 జిల్లాల నుంచి 27శాతం, టైర్-3, 4, 5 జిల్లాల నుంచి 33శాతం మంది సర్వేలో తమ అభిప్రాయం తెలిపారు. మెజారిటీ మహిళలు, పురుషులు.. గత వారం రోజులుగా వంట గ్యాస్ సిలిండర్ డెలివరీ ఆలస్యం, బ్లాక్‌మార్కెటింగ్ జరుగుతోందని చెప్పారు. సర్వేలో పాల్గొన్న 29 శాతం మంది .. డీలర్లు తమ వద్ద స్టాక్‌లేదని చెబుతున్నట్టు తెలిపారు. ఇక, అధిక ధరలకు బ్లాక్‌మార్కెట్ నుంచి కొనుగోలు చేస్తున్నట్టు 14శాతం మంది తెలిపారు. సిలిండర్ల డెలివరీ ఆలస్యం అవుతుందని డీలర్లు ముందుగానే హెచ్చరించినట్టు 53 శాతం మంది పేర్కొన్నారు. అయితే, మరో 43 శాతం మంది మాత్రం డీలర్లు అసలు ఈ విషయాన్ని ప్రస్తావించలేదన్నారు. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఎల్‌పీజీ సిలిండర్లను బ్లాక్‌మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్నట్టు సర్వేలో తేలింది. 36 శాతం మంది మహిళలు.. తాము బ్లాక్ మార్కెట్‌లో రూ.100-500 వరకు అధిక మొత్తం చెల్లించి సిలిండర్లు కొనుగోలు చేసినట్టు పేర్కొన్నారు. వీరిలో 8 శాతం మంది రూ.100, 11 శాతం మంది రూ.100-300, 8 శాతం మంది రూ.300-500, 9 శాతం మంది రూ.500 కంటే అధికం చెల్లించి సిలిండర్లు కొనుగోలు చేసినట్టు వివరించారు. మరోవైపు, 39 శాతం మంది తమ పొరుగు వారి నుంచి సిలిండర్లను తీసుకున్నట్టు వెల్లడించారు.