Share News

వంటిల్లు నుంచి ‘వాటికల’ వరకు యుద్ధ మంటలు

ABN , Publish Date - Mar 10 , 2026 | 05:02 AM

పశ్చిమాసియాలోని యుద్ధ ప్రభావం భారతదేశంలో గ్యాస్‌, ఎల్‌ఎన్‌జీ ధరల పెంపు రూపంలో వంటిల్లు నుంచి శ్మశాన వాటికల వరకు కనిపించడం మొదలైంది.

వంటిల్లు నుంచి ‘వాటికల’ వరకు యుద్ధ మంటలు

  • ఎల్‌ఎన్‌జీ, సీఎన్‌జీ నిల్వలు క్రమంగా ఆవిరి

  • పుణెలోని శ్మశాన వాటికలపై ఈ ప్రభావం

  • అక్కడి గ్యాస్‌ ఫర్నేసులు మూసివేత

న్యూఢిల్లీ, మార్చి 9: పశ్చిమాసియాలోని యుద్ధ ప్రభావం భారతదేశంలో గ్యాస్‌, ఎల్‌ఎన్‌జీ ధరల పెంపు రూపంలో వంటిల్లు నుంచి శ్మశాన వాటికల వరకు కనిపించడం మొదలైంది. మన దేశ ఎల్‌ఎన్‌జీ అవసరాల్లో ఎనిమిది శాతం ఖతార్‌ తీరుస్తోంది. ఇప్పుడు ఆ దేశం యుద్ధంలో చిక్కుకుపోవడంతో అక్కడి నుంచి సరఫరాలు ఆగిపోయాయి. ఇప్పుడు చేతిలో ఉన్న ఎల్‌ఎన్‌జీ నిల్వలు మరో రెండు నుంచి నాలుగు వారాలకు మాత్రమే సరిపోతాయి. పారిశ్రామిక, రవాణా సంబంధ రంగాలు ఇప్పటికే ధరల ఒత్తిడికి గురి అవుతున్నాయి. పరిశ్రమలకు అందిస్తున్న ఇక్స్‌ట్రా గ్యాస్‌ ధరను క్యూబిక్‌ మీటరుకు రూ.40 నుంచి రూ.119కు ‘అదానీ టోటల్‌ గ్యాస్‌’ ఒక్కసారిగా పెంచేసింది. ఢిల్లీ వంటి నగరాల్లో సీఎన్‌జీ ధరలు 5-10శాతం పెరిగాయి. ప్రస్తుతం కిలో సీఎన్‌జీ ధర రూ. 75-80 మధ్యలో ఉంది. అంతర్జాతీయ చమురు ధరలు 10-15 శాతం పెరగడంతో ప్రస్తుతం బ్యారల్‌ చమురు ధర 75-80 డాలర్లు ఉంది. అయినప్పటికీ ఎక్సైజ్‌ సడలింపుల ద్వారా కేంద్రం లీటరు పెట్రోల్‌, డీజిల్‌ ధరను ఢిల్లీ వంటి నగరాల్లో రూ. 94-100 మధ్య ఉంచగలుగుతోంది.

‘దహనాలు’ బంద్‌

గ్యాస్‌కొరత ప్రభావం నేరుగా శ్మశానవాటికలపై పడింది. గ్యాస్‌ ఆధారిత దహన సంస్కార కార్యక్రమాలను మహారాష్ట్రలోని పుణె మునిసిపాలిటీ నిలిపివేసింది. వంటింటి అవసరాలు మినహాయించి ఇతరేత్రా గ్యాస్‌ వినియోగాన్ని తగ్గించుకోవాలని ఈ నెల ఐదో తేదీన కేంద్ర పెట్రోలియం శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో పుణెలోని వైకుంఠ ధామ్‌లోని మూడు గ్యాస్‌ ఆధారిత ఫర్నేసులను (కొలిమి) మూసివేశారు. ఈ ఫర్నేసులను వాడి రోజుకు సుమారు 20 దహన కార్యక్రమాలు నిర్వహిస్తుండగా, గ్యాస్‌ కొరతతో ఇప్పుడు ఆ సంఖ్య రెండుకు పడిపోయింది. ప్రతి దహనానికి సగటున 18 కిలోల గ్యాస్‌ అవసరం అవుతుంది. దీంతో ఇప్పుడు ఇక్కడ విద్యుత్‌ చితిని వినియోగిస్తున్నారు.

Updated Date - Mar 10 , 2026 | 05:02 AM